– కాపాడమంటూ కార్మికుల వాట్సప్ సందేశం
– తక్షణమే స్పందించిన హరీష్‌రావు
– ఖర్చులన్నీ భరించి స్వదేశానికి రప్పిస్తున్న వైనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బతుకుబండిని నడిపేందుకు, కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్ వెళ్లాం.. కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించట్లేదు సార్.. మమ్మల్ని కాపాడండి అంటూ తెలంగాణ గల్ఫ్ కార్మికులు పంపిన ఒక్క వాట్సప్ మెసేజ్ వారికి దారి చూపింది. వారి గోడును ఆలకించిన మాజీ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ ఆదేశాలతో 12 మందిని ఎలాగైనా రప్పించాలని నిశ్చయించుకున్నారు. వారికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి.. ఎట్లయినా మిమ్మల్ని వెనక్కు తీసుకొస్తాం అని భరోసా ఇచ్చారు. ఒకవైపు ఆ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తీసుకెళ్లవచ్చు అని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు. కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతోపాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీష్‌రావు భరించారు. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటలకు చెందిన 12మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. సుదీర్ఘ కాలపు ఎదురుచూపుల తర్వాత వారి కుటుంబాలను కలుసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నామని జోర్డాన్‌లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా తమ వారు సొంతూళ్లకు రాబోతున్నారని వారి కుటుంబ సభ్యులు సంతోపడుతున్నారు. ఇందుకు ఎంతగానో కృషి చేసిన హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమం సమ ప్రాధాన్యంగా సాగిన కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే రేవంత్ 22 నెలల పాలనలో వలసలు మళ్లీ మొదలయ్యాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



