– అందరి కృషితో గ్లోబల్‌స్థాయికి చేరిన మెగా బతుకమ్మ
– కార్యక్రమం విజయవంతంపై మంత్రి సీతక్క హర్షం
– కార్యక్రమానికి హాజరైన మిస్ వరల్డ్ సుచాత
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఒకే ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడడం, అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదవడం రాష్ట్రానికే గర్వకారణమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో మెగా బతుకమ్మ కార్యక్రమంలో ఆమె పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈరోజు గ్లోబల్ స్థాయికి మన బతుకమ్మ వెళ్ళింది.. ఎంత శ్రద్ధతో, నిష్టతో, భక్తితో, పవిత్రతతో బతుకమ్మ ఆడి రికార్డు సృష్టించిన అక్కచెల్లెమ్మలందరికీ వందనాలు.. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలం అని మీరు నిరూపించారు అని మహిళలకు కితాబు ఇచ్చారు. నేడు తెలంగాణ బతుకమ్మ కీర్తిని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి మహిళామణులు తెలంగాణ సత్తా చాటారని కొనియాడారు. తెలంగాణ ఆడబిడ్డలు దేన్నైనా సాధిస్తారని ఈరోజు నిరూపించారన్నారు. ఆకాశం హద్దుగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జై బతుకమ్మ.. జై తెలంగాణ అని నినాదం చేశారు. కాగా, విమలక్క, ప్రముఖ గాయని గీతా మాధురి, సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్‌లు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఈ మెగా బతుకమ్మ కార్యక్రమానికి మిస్ వరల్డ్ ఓపెన్ సుచాత, కాంటినెంటల్ మిస్ వరల్డ్ ప్రతినిధి బృందం కూడా హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన పూల పండుగ బతుకమ్మ పండుగ నేడు గిన్నిస్ బుక్‌లో నమోదు కావడం పట్ల మిస్ వరల్డ్ ఓపెన్ సుచాత శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూల పండుగ మహిళల సాధికారతకు తోడ్పడుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





