మీ సంతోషమే మా సంతోషం

– బెండాలపాడులో సీఎం రేవంత్‌
– గిరిజనులచే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మీ అందరి ముఖంలో సంతోషం కనిపిస్తోంది.. మీ సంతోషమే మా సంతోషం.. మీ అందరికీ మంచి చేయాలని మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇండ్లు కట్టించారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లలో గిరిజన లబ్ధిదారులు బచ్చల రమణ, బచ్చల నరసమ్మ చేత ఆయన గృహ ప్రవేశం చేయించారు. ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. సరిగ్గా గృహ ప్రవేశం చేసేటప్పుడు వరుణ దేవుడు ఆశీర్వదించాడన్నారు. ఇప్పటివరకు 4,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మరో రెండున్నరేళ్లలో ఇంకో 4,500 ఇండ్లు ఇస్తామని చెప్పారు. గతంలో వైఎస్‌ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని తెలిపారు. మధ్యలో పదేండ్లు కరవొచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 4.50 లక్షలు కాగా వాటిలో 2,05,297 ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారుడికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేస్తున్నామని, ఇసుక ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఇక నుంచి మరో పదేండ్లు అందరూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి అంటూ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఏలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *