– జీపీవోలకు నియామక పత్రాల అందజేత
– హైటెక్స్‌లో ‘కొలువుల పండుగ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: పేదల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని జీపీవోలుగా తిరిగి నియమించామని, ప్రభుత్వానికి, పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలని ముఖ్యమంత్రి గ్రామ పాలనాధికారు(జీపీవో)లకు సూచించారు. హైటెక్స్‌లో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీపీవోలుగా నియామకమైన వారికి నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ సాధనలో, ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన మీరు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు. భూ భారతి చట్టాలను అమలు చేయడమే కాదు.. సాదా బైనామాల సమస్య పరిష్కరించాలన్నారు. గత పాలకులు మిమ్మల్ని తెలంగాణ సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.. మీపై పడిన మచ్చను చెరుపుకునే అవకాశం మీకు వచ్చింది.. ఆ ముద్రను చెరిపేసి నాటి పాలకుల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించండి అని పేర్కొన్నారు. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య.. మీపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించూసుకునేలా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా.. ఎవరో కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా? వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది.. మరి వాళ్లనేం చేయాలి అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసం జరిగినవేనని, కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి వంటి వాళ్లు భూమి కోసమే పోరాడారని, భూమి కోసం పోరాటాలే కాదు భూదాన్ ఉద్యమానికి పునాదులు పడిరది కూడా తెలంగాణ ప్రాంతంలోనేనని తెలిపారు. వెదిరె రామచంద్రారెడ్డి వేలాది ఎకరాలు పేదలకు పంచి భూదానోద్యమం చేశారని, ఆనాడు పీవీ నర్సింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచారని తెలిపారు. అయితే భూమిని చెరబట్టిన వారిని బీఆర్‌ఎస్ పాలకులను రాష్ట్ర ప్రజలు దిగంతాలకు తరిమారన్నారు. గత ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములను కొల్లగొట్టాలని చూశారని ఆరోపించారు. తమ దోపిడీకి వీఆర్వో, వీఆర్‌ఏలు అడ్డుగా ఉన్నారని వారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ధరణి సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే సిరిసిల్లలో అధికారులపై తాళిబొట్టు విసిరిన పరిస్థితి ఉందని, ఇది అధికారుల వల్ల జరగలేదు.. నాటి పాలకులు సృష్టించిన వైరస్ అని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఆనాడు చెప్పాం.. ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూ భారతి చట్టం తీసుకొచ్చాం.. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో పరిష్కరించే ప్రయత్నం చేశాం అని సీఎం వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





