మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు
– సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం
– ప్రతి మహిళా మహిళా సంఘాలలో చేరాలి
– ఇక ముందు మ‌హిళ‌ల‌కు నచ్చిన చీరలను పంపిణీ చేస్తాం
– మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు ,ప్రజాతంత్ర ,మార్చి 7:మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్న‌దని, ప్రతి మహిళ మహిళా సంఘాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొంది ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. ములుగు మండలం దేవగిరిపట్నం, కన్నాయిగూడెం, ఇంచర్ల గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద‌ రూ.10 లక్షల వ్య‌యంతో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం దేవగిరిపట్నం ఇందిరమ్మ పథకం ద్వారా చింతలపూడి వినోద ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల సమావేశానికి మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ తో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు రెండున్నర సంవత్సరాల పాలనలో రూ.36 వేల కోట్ల రుణాలను అందజేశామ‌ని, రూ.1121 కోట్ల  వడ్డీ మాఫీ చేశామ‌న్నారు. మహిళలు వారి హక్కులను సాధించడం కోసం కమ్యూనిస్టు యోధురాలు లారా జెకిథీన్ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ఎదగడానికి ఎనలేని కృషి చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పక్షంలో లక్ష ఆర్థిక సహాయాన్ని ముందే అందజేస్తామ‌న్నారు. దీంతో వారు త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. సంఘ సభ్యురాలై ఉండి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నదని, ఇప్పటికైనా ప్రతి మహిళ సంఘాలలో చేరాలని సూచించారు.ప్రజా ప్రభుత్వం మహిళ సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తూ వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే గతంలో అనేక సమస్యలు ఎదుర్కొనే వారని  రాష్ట్రవ్యాప్తంగా మ‌హిళా సంఘాల‌కు సుమారు 6వేల శాశ్వ‌త‌ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఒక్కో భవనానికి ఉపాధి హామీ పథకం 10 లక్షల నిధులతో నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మహిళలకే అప్పగించామని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, రవాణా సౌకర్యాల కోసం మండల సమాఖ్యలకు బస్సులు కూడా మంజూరు చేస్తున్నామని, గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని,దీని ద్వారా మహిళలు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రామాల్లో వాడుకోవడమేకాక మిగిలిన విద్యుత్ ప్రభుత్వానికే అమ్ముకునే అవకాశం ఉంటుందని, గ్రామాల్లో సరైన పంట నిల్వ చేసుకునే గోదాములు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సుమారు రూ.30ల‌క్ష‌ల వ్యయంతో గోదాములను కూడా ఏర్పాటు చేస్తున్నామని వాటి నిర్వహణను సైతం మహిళా సంఘాలకే అప్పగిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని ,సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళా స్వయం సహాయక 585 సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజి ద్వారా రూ.52.5 కోట్ల‌ రుణాలు చెక్కును మంత్రి అందచేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, పి ఆర్ ఈఈ అజయ్ కుమార్, డిఈ లింగారెడ్డి, యం పి డి ఓ, యం పి ఓ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *