వ్యక్తిగత బ్యాంకు ఖాతా లపై సర్కార్ నజర్..!

“ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప, తమ వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. ఒక వ్యక్తి పొరపాటుగా ఎరుపు రంగు సిగ్నల్ దాటితే ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే సాంకేతికతను తీసుకువస్తున్న ప్రభుత్వం, మరి అదే వ్యక్తి రోడ్డు మీద ఉన్న ప్రమాదకరమైన గుంతలో పడి గాయపడితే, ఆ చికిత్స ఖర్చులను అతని అకౌంట్ లో ఎందుకు జమ చేయదు? “

  •  చలాన్ల పేరిట జనం జేబులకు చిల్లు..
  •  ఇది పాలన కాదు, పేదవాడిపై పీడనం!
వెంక గారి భూమయ్య
సీనియర్,జర్నలిస్ట్ విశ్లేషణ
9848559863

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న “ఆటోమేటిక్ చలాన్ డిడక్షన్” విధానం ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట ఒక శరాఘాతంగా మారుతోంది. వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడటమే ఆలస్యం, మరుక్షణం బ్యాంకు ఖాతా నుంచి పైసలు మాయమైపోతాయన్న వార్త విన్నప్పటి నుంచి సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది డిజిటల్ యుగంలో తీసుకువస్తున్న అద్భుతమైన సంస్కరణ అని పాలకులు చంకలు గుద్దుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అసలు ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకుని బ్యాంకులో దాచుకున్న సొమ్ముపై ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని నేరుగా చేయి వేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయడం అంటే ప్రజల వ్యక్తిగత ఖాతాల మీద నియంత్రణ సాధించడం కాదు. రోడ్లు అద్దంలా ఉండి, ట్రాఫిక్ సిగ్నల్స్ నిరంతరం పనిచేస్తూ, ఎక్కడా ఒక్క గుంత కూడా లేకుండా ఉండి ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేవారు.

కానీ, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు, వర్షం పడితే నీళ్లు నిలిచి గుంతలు ఎక్కడున్నాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనం నడుపుతున్న సామాన్యుడికి ఈ నిబంధనలు ఎలా వర్తిస్తాయి? గుంతను తప్పించబోయి గీత దాటితే, అకౌంట్లో ఉన్న ఆఖరి వంద రూపాయలు కూడా ప్రభుత్వం లాగేసుకుంటే, ఆ రోజు ఆ పేదవాడి ఇంట్లో పొయ్యి ఎలా వెలుగుతుంది? గతంలో కేసీఆర్ గారి పాలనలో నిబంధనలు ఉన్నా, వాటి వెనుక మానవత్వం ఉండేది, జరిమానాల్లో రాయితీలు ఇచ్చి ప్రజలను గౌరవించే సంస్కృతి ఉండేది.
కానీ ఇప్పుడు అంతా యాంత్రికంగా, కేవలం జరిమానాల ద్వారా ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ విధానం ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. చట్టం అంటే భయం ఉండాలి కానీ, భయంకరమైన దోపిడీలా అనిపించకూడదు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరిగిన ప్రమాదాలకు బాధ్యత వహించని పాలకులు, ప్రజల చిన్న చిన్న పొరపాట్లపై మాత్రం ఇంత కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయం? ఈ నిర్ణయం చూస్తుంటే పాలన అంటే ప్రజలను సేవించడం కాదు, వారి నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయడం అన్నట్లుగా మారిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
​పాలనలో పారదర్శకత ఏది? బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట!
​ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప, తమ వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. ఒక వ్యక్తి పొరపాటుగా ఎరుపు రంగు సిగ్నల్ దాటితే ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే సాంకేతికతను తీసుకువస్తున్న ప్రభుత్వం, మరి అదే వ్యక్తి రోడ్డు మీద ఉన్న ప్రమాదకరమైన గుంతలో పడి గాయపడితే, ఆ చికిత్స ఖర్చులను అతని అకౌంట్ లో ఎందుకు జమ చేయదు? నిబంధనల అమలు అనేది రెండు వైపులా ఉండాలి.
ప్రజలు పన్నులు కడుతున్నారు, ఓట్లు వేశారు, అంటే వారికి గౌరవప్రదమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నైతిక బాధ్యత పాలకులపై ఉంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో విఫలమై, పార్కింగ్ స్థలాలు కల్పించకుండా, రోడ్ల వెడల్పు చేయకుండా కేవలం కెమెరాలు పెట్టి జరిమానాలు వసూలు చేయడం ద్వారా క్రమశిక్షణ వస్తుందని అనుకోవడం భ్రమ. ఇది ప్రజలను భయపెట్టి బ్రతకడం నేర్పడం తప్ప, వారిలో మార్పును తీసుకురావాలని అనుకోవడం కాదు. ఈ విధానం అమలులోకి వస్తే, సామాన్యుడు ప్రతి అడుగు భయంతో వేయాల్సి ఉంటుంది, ఇది సంక్షేమ రాజ్యం అనిపించుకోదు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యతను మరియు ఆస్తి హక్కును కాలరాస్తూ, బ్యాంకు ఖాతాల్లోకి చొరబడటం అంటే ప్రజల స్వేచ్ఛను హరించడమే. పాలకులు ప్రజల పట్ల సేవకులుగా ఉండాలి కానీ, పన్నుల పేరిట వారిని వేధించే వేటగాళ్లుగా మారకూడదు.
​ప్రజల పక్షాన నిలదీత…. ప్రభుత్వంపై సానుభూతికి తావులేదు
​ప్రజలు ఏనాడూ చట్టాన్ని గౌరవించకూడదని అనుకోరు. కానీ ఆ చట్టం అమలు చేసే వ్యవస్థలో పారదర్శకత ఉండాలని కోరుకుంటారు. ఒక సామాన్యుడు సిగ్నల్ జంప్ చేశాడని అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసే ప్రభుత్వం, అదే సిగ్నల్ పని చేయకపోవడం వల్ల ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోయిన పౌరుడికి ఎంత పరిహారం చెల్లిస్తుంది? రోడ్ల మీద ఉన్న గుంతల వల్ల టైర్లు పగిలిపోయినా, వెన్నుముక విరిగినా ఏ ప్రభుత్వ విభాగం నుంచి అకౌంట్లో డబ్బులు పడతాయి? ఇక్కడే ప్రభుత్వం తన నైతికతను కోల్పోతోంది. కేవలం వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ, రోడ్ల మరమ్మతుల మీద లేకపోవడం పాలకుల వైఫల్యమే. ప్రజల మీద భారం వేయడమే గొప్ప పాలన అని భ్రమపడుతున్న ఈ ధోరణిని ప్రజలు సహించే స్థితిలో లేరు.
 ఇది డిజిటల్ సంస్కరణా లేక ఆర్థిక సంక్షోభమా?
​అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఒక పెద్ద అయోమయం నెలకొంది. అసలు ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను ప్రభుత్వం ట్యాప్ చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవేళ టెక్నాలజీ ద్వారా దీనిని అమలు చేస్తే, పొరపాటున చలాన్ పడితే ఆ వ్యక్తికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేక డబ్బులు పోయాక కార్యాలయాల చుట్టూ తిరగాలా? ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రజలు అసలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడమే మానేస్తారా అన్న సందిగ్ధత మొదలైంది. ఒకవైపు ప్రజా పాలన అని చెప్పుకుంటూనే, మరోవైపు జేబులు గుల్ల చేసే నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే ప్రభుత్వం ఏ దిశగా వెళ్తుందో ఎవరికీ పాలుపోవడం లేదు. చివరకు ఇది ఒక క్రమశిక్షణ కలిగిన సమాజానికి దారితీస్తుందా లేక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య యుద్ధానికి కారణమవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *