– హైకోర్టు స్టేపై వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
– రాజకీయ స్వలాభం కోసమే బీసీ హక్కులు పణంగా పెట్టారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపినప్పటికీ ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. గవర్నర్‌కు పంపిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బిజెపి అడ్డుకుంటోంది అని దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ ప్రభుత్వానికి చట్టపరమైన అవగాహన లేదా ఆలోచనల్లో స్పష్టత లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు ఇస్తూ బీజేపీ దానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో 57 శాతం రిజర్వేషన్ల కోసం బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోందని, కాబట్టి రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తోందని చెప్పారు. అసలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసిందే కాంగ్రెస్ వారని రామచందర్ రావు ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





