ప్రభుత్వ నిర్ణయాలు ప్రజామోదంగానే ఉండాలి!

రాష్ట్రంలో మూసీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మురికి కంపు కొట్టిస్తున్నాయి. చివరకు జుగుప్స  కలిగిస్తున్నాయి. పరస్పర విమర్శలు, బజార్‌ భాష వాడడం గతంలో ఎప్పుడూ లేనంతగా వినిపిస్తోంది. రాజకీయనాయకులు దిగజారి పోయారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమ ఎన్నడూ లేనంతంగా ఆక్రందన చెందింది. అలాగే కెటిఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా  పోస్టులు గమనిస్తే రాజకీయాలు ఎంతగా దిగజారి పోయాయో అర్థం చేసుకోవొచ్చు. ఇకపోతే మూసీ అభివృద్ది పేరుతో ప్రభుత్వం చేపట్టిన పనులు విపక్షాలకు అస్త్రంగా మారింది.  ఈ ప్రాజెక్టును విపక్ష బిజెపి, బిఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మిగతా ప్రాధాన్యాలను వదిలేసి కేవలం మూసీ, హైడ్రాలనే ప్రధానంగా ఎంచుకున్నది. నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టడం, ధరలపై చర్యలు తీసుకోవడం, మంచినీటి సమస్యను తీర్చడం  వంటి అనేకానేక సమస్యలు వేధిస్తున్నా పట్టించుకోవడం లేదు.  మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. బాధితులకు అండగా బిఆర్‌ఎస్‌, బిజెపి నేతలు నిలిచారు.

వారికి మద్దతుగా పోరాడుతున్నారు. బాధితులు కూడా మూసీని వొదిలి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా మూసీ ఆక్రమణలకు గురవుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణమామే. కానీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ప్రణాళిక ఉండాలి. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. విమర్శలు  హద్దులు దాటుతున్నాయి. ఈ సమస్య తీవ్రం  కాకముందే తాత్కాలికంగా మూసీ ప్రాజెక్టును  పక్కన పెట్టి చర్చించాలని పలువురు మేధావులు సైతం సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన కొత్తలో నాటి కెసిఆర్‌ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. అప్పులు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలు బాగా బయటకు వచ్చాయి. వీటిపైనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఈ రెండు విషయాలు ప్రభుత్వ ప్రాధాన్యం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇప్పుడంతా మూసీ ప్రాజెక్ట్‌పై రాజకీయం నడుస్తోంది.  మూసీతో విపక్షాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సిఎం రేవంత్‌ కూడా ఏమాత్రం దూకుడు తగ్గించుకోవడానికి సిద్దంగా లేరు. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హైడ్రా, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై బుల్డోజర్ల వంటి కార్యక్రమాలపై ఇప్పుడు సమీక్షించు కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడైనా  ప్రజామోదంగానే ఉండాలి.

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేతలు అందుకు కారకులైన  మాజీ సీఎం కేసీఆర్‌ను, బిఆర్‌ఎస్‌ నేతలను  ఇరికిస్తారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని తేలిపోయింది.  ఇకపోతే కాంగ్రెస్‌ రుణమాఫీ కూడా ఎదురుదిరుగుతోంది. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అంటోంది. అయితే జరగలేదని విపక్షం అంటోంది. ఈ విషయంలో  విపక్ష బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే ఆయుధం సమకూర్చినట్లయింది.  ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చిందని వాటిని అమలు చేయడం లేదని బిజెపి, బిఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు హైడ్రా, మూసీ, ఇటు రైతు రుణమాఫీ తదితర పనులతో కొంత ప్రజా వ్యతిరేకత మొదలైందని  చెప్పాలి. కాంగ్రెస్‌ చేస్తున్న తప్పిదాలు బీఆర్‌ఎస్‌కు అందివొచ్చిన అవకాశంలా మారాయి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే కాంగ్రెస్‌ది కూల్చివేతల ప్రభుత్వం అంటూ కెటిఆర్‌ విమర్శలు గుప్పిస్తు న్నారు. ఎన్నికల వరకు ఊపుమీదున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేసులు వెన్నాడుతున్నాయి.

మరోవైపు మూసీ కూల్చివేతలు, సర్వే నిర్వాసితుల్లో దడ పుట్టిస్తున్నది. తహసీల్దార్ల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తూ నిర్వాసి తులను ఒప్పించే యత్నం చేస్తున్నది. ఆ బృందాలను చూస్తేనే అక్కడి జనం వణికిపోతున్నారు. విడదీసీ  తరలించు అన్నట్టుగా ఒక్కో బృందం కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారిని ఖాళీ చేయించే చర్యలకు పాల్పడుతున్నది. తమంతట తాము ఖాళీ చేస్తే రూ.25 వేల పారితోషికం  ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. కానీ చాలామంది తమ గూడును వదలడానికి అంగీకరించడంలేదు. కొంతమంది పెద్ద దిక్కులేని వాళ్లు భయంగానే అంగీకరించినట్టు చెప్తున్నారు. చాలామంది డబ్బులు పెట్టి జాగాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు.  మూసీ బాధితులు మొత్తంగా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడు తున్నారు.  విపక్షాలు తోడు కావడంతో ఇప్పుడు పరిస్థితి చేజారి పోయే ప్రమాదం ఏర్పడిరది.  మూసీ సుందరీకరణను ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. హైదరాబాద్‌ అభివృద్ధికి మూసీ సుందరీకరణ కూడా తోడవ్వాలి. అయితే అది విమర్శలకు దారితీయకుండా ప్రశంతంగా సాగితే అందరికీ మంచిది. అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా సాగాలి. దెబ్బతిన్న రోడ్లు బాగు చేయడంలో ముందుకు రావడం లేదు. ఈ విషయంలో  చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 -రేగటి నాగరాజు
(సీనియర్‌ జర్నలిస్ట్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *