– ఉద్యోగ నోటిఫికేషన్లపై హామీలకు దిక్కేది
– అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా నిలదీస్తాం
– ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి

నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్‌ ‌క్యాలెండర్‌ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి అన్నారు. వీటన్నిటిపైనా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎండ‌గడతామన్నారు. అయితే సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని అర్థం అవుతోందన్నారు. నిరుద్యోగులు రెండున్నరేండ్లుగా కండ్లుకాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమ‌ర్శించారు. హామీ మేరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయ‌న‌ డిమాండ్‌ ‌చేశారు. ఇదిలావుంటే పోలీస్‌ శాఖలో తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలని పోలీస్‌ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌ ‌చేస్తున్నది. భారీగా నిరసలకు పిలుపునిచ్చింది. భారీ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే ఆవిష్కరించింది. వెంటనే నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని, వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని, జీవో 46ను రద్దు చేయాలని, లాంగ్‌జంప్‌ను 3.8 టర్లకు తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో నిరసన చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ పోలీస్‌ ఉద్యోగార్థులకు అలవిగాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వేముల అన్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం కర్ణాటక తరహాలో ఉద్యమిస్తామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. జనరల్‌ ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ ’తెలంగాణ నిరుద్యోగ జేఏసీ’ ఆధ్వర్యంలో 13న నిరుద్యోగ మార్చ్ ‌నిర్వహించనున్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైనందున నిరుద్యోగ మార్చ్‌కు భారీగా నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 13న అసెంబ్లీ ముట్టడితోపాటు టీజీపీఎస్సీని కూడా ముట్టిస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఏడాదికి ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో, బడ్జెట్‌ ‌సమావేశాలలోపు అన్నిశాఖల్లో ఉన్న ఖాలీలతో మరో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేసారు. 2024 ఆగస్టులో అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌చిత్తు కాగితంలా మారిపోయిందని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కోచింగ్‌ ‌సెంటర్లలోనే సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో డబ్బులు పంపేందుకు కూడా తల్లిదండ్రులు సంకోచిస్తున్నారని, స్వగ్రామాలకు వెళ్తే తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదని నిరుద్యోగులు వాపోతున్నారని వేముల అన్నారు.
———————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.