ప్రమోషన్ గరిష్ట వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంబంధిత ఫైల్‌పై గురువారం సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా ఇప్పుడు వారికి మళ్ళీ అవకాశం లభించనుంది. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడి హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ఆ ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 50 ఏళ్ల వయస్సులో టీచర్‌గా పదోన్నతి పొందే హెల్పర్లు ఇంకా 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. వయస్సు కారణంగా తాము టీచర్లుగా ప్రమోషన్ కోల్పోతున్నామని బాధపడిన తమకు సీతక్క న్యాయం చేశారన్నారు.





