ఉద్యోగులకు ఒక డీఏ, హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం
పెండింగ్ బిల్లులు చెల్లింపు
ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంపు
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
భేటీలో మంత్రులు పొంగులేటి, పొన్నం,
వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ (డియర్‌నెస్ అలౌయెన్స్) ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్యాబినెట్ సమావేశం అనంతరం సెక్రటేరియట్లో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వివరాలు వెల్లడించారు. ఉద్యోగులకు రెండు డిఏలు ఇవ్వాలని నిర్ణయించాం.. ఒక వెంటనే అమలు చేస్తాం, మరో డీఎ ను 6 నెలల తర్వాత అమలు చేస్తాం. త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తాం. ప్రతినెల ఉద్యోగులు 500 చొప్పున జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్టులో అధికారులు సభ్యులుగా ఉంటారు. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ప్రతినెల 700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. సెక్రటేరియట్లో 12.5% కోట ఉండాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ కు ఆమోదం తెలిపారు. మెడికల్ ఇన్ వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసింది.
రిటైర్ అయిన ఉద్యోగుల సేవలు తిరిగి వినియోగించుకోవద్దని నిర్ణయిచాం. గ్రామపంచాయతీలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీని అనుసరించి గ్రేడింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్స్ కు సంబంధించి డీపీసీ ఏర్పాటు, ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన ఉద్యోగులు అధికారులను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల క్లియర్ తో పాటు వాహనాల హద్దులు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జీవో 317 ఎగ్జామిన్ చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేశారు.
క్యాబినెట్ సబ్ కమిటీని నా అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. వారి సంక్షేమానికి సంబంధించి క్యాబినెట్లో లోతుగా చర్చించామని తెలిపారు.. అధికారులు నివేదించిన అంశాలు, క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లను క్యాబినెట్లో సబ్ కమిటీ చైర్మన్ గా వివరించానని చెప్పారు. . ఉద్యోగుల డిమాండ్లను క్యాబినెట్ సహచరులు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ సహచరులందరికీ ఉద్యోగుల సబ్ కమిటీ చైర్మన్ గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తునని భట్టి విక్రమార్క తెలిపారు.



