– తులం మరో రూ.3వేలు పెరుగుదల
హైదరాబాద్, అక్టోబర్ 21: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధర మంగళవారం దాదాపు రూ.3వేలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.1.34 లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా కేజీ దాదాపు రూ.4వేలు పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్లు) రూ.1,31,600 పలకగా మంగళవారం రూ.1,34,500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,21,000గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సోమవారం రూ.1,67,300 పలికింది. నేడు ఆ ధర రూ.1,71,200కు పెరిగింది. గత వారం రూ.1.85 లక్షల వరకు ఎగబాకిన వెండి ధర ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలు మరోసారి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,335 డాలర్లు, ఔన్సు వెండి ధర 51 డాలర్ల పైనే పలుకుతోంది. డాలర్ విలువ తగ్గిపోతుండటం వంటి పరిణామాలతో పసిడిలో పెట్టుబడులకు మదుపరులు మొగ్గుచూపుతున్నారు. ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లలో, కమొడిటీస్ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్‌పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఇక, పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





