“కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు ఏలా పుట్టుకు వస్తాయో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన నిదర్శనం గా ఉంది . ఈ ప్రకటనలో బనకచర్ల ప్రస్తావన లేదు. ఈ అంశమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకుల విమర్శలకు జవాబుగా చెప్పారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో భిన్నంగా ప్రచారం జరుగుతోంది. బనకచర్ల అనుసంధానం క్లియర్ చేసేందుకే సాంకేతిక కమిటీ అనే ధోరణిలో ఉంది . ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ప్రేక్షకుడుగా వ్యవహరించడం వెనుక కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి? సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర మంత్రి సి ఆర్ పాటిల్. తమాషా ఏమంటే ముఖ్యమంత్రులే మాట్లాడు కొని సాంకేతిక కమిటీ ప్రతిపాదన ఒకరు చేస్తే మరొకరు బలపర్చి సమావేశం ముగించారు. సోమవారం కల్లా కమిటీ ఏర్పాటు చేయ బడుతుందని చెప్పారు. ఇప్పటికి రెండు మూడు సోమవారాలు గడచి పోయాయి. ఇదంతా పరిశీలించితే తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదుపరి శాసనసభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గల జల వివాదాల్లో అంటీ అంటనట్లు వ్యవహరించునట్లుంది.“*

కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న చట్ట బద్దత గల కృష్ణా యాజమాన్య బోర్డు ఆచరణలో నిస్తేజంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు రోజు రోజుకూ ఉధృత మౌతున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 మేరకు యాజమాన్య బోర్డు ఏర్పడింది. వాస్తవంలో రెండు తెలుగు రాష్ట్రాలు అవతరించిన 60 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కృష్ణ గోదావరి యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయాలి. ఆచరణలో మూడు సంవత్సరాల తర్వాత గాని ఏర్పాటు చేయలేదు. ఈ లోపు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల వద్ద బాహాబాహీకి తలపడిన సందర్భాలున్నాయి. ఆ మాట కొస్తే బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇటువంటి దుస్సంఘటనలు జరిగాయి.
ఎన్నికల ముందు సాగర్ పై జరిగిన రగడ కొత్తగా చెప్ప పని లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించితే యాజమాన్య బోర్డు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటిగా మేక చన్నుతో సమానంగా మిగిలి అనేక సంఘటనలకు దుష్ప్రచారాలకు దారి తీస్తోంది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 సబ్ సెక్షన్ 8(a) లో యాజమాన్య బోర్డు విధులు స్పష్టంగా పేర్కొన్నారు. 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద నియమింపబడిన ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు మేరకు నీటి రెగ్యులేషన్ పూర్తి బాధ్యత యాజమాన్య బోర్డుదే. గమనార్హమైన అంశమేమంటే బోర్డు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు ఖాతరు చేయని సందర్భాలున్నాయి. అట్లని చట్ట బద్దత గల సంస్థగా వ్యవహరించవలసిన బోర్డు చేతులు ముడుచుకొని కూర్చుంటే మరి బోర్డు ఎందుకు? . ప్రస్తుతం బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే కాకుండా రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మధ్య కూడా వైషమ్యాలు పెరిగాయి .
ఈలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నీటి సంవత్సరం మొదలై రెండు నెలలు కావస్తున్నా యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు అటుంచి కనీసం సమావేశం కూడా కాక పోవడం క్షంతవ్యం కాదు. విచారకరమైన అంశమేమంటే యాజమాన్య బోర్డుకు పూర్తి స్థాయి చైర్మన్ లేరని చెబుతున్నారు. నీటి సంవత్సరం మొదలైనా కొత్త చైర్మన్ ను నియమించక పోవడం తో ప్రతి చిన్న సంఘటన రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక రూపంలో చిచ్చు రేగుతూ ఉద్రిక్తతలు తలెత్తుతున్న అంశం కేంద్రం జల వనరుల శాఖ మంత్రి కే కాదు కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తెలియనిది కాదు. ఈ పరిస్థితుల్లో యాజమాన్య బోర్డుకు పూర్తి కాల చైర్మన్ ను ఎందుకు నియమించ లేదు ? నిన్న గాక మొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర జల వనరుల శాఖ చైర్మన్ ఉన్నా లేకున్నా ఇన్ చార్జ్ చైర్మన్ తోనైనా యాజమాన్య బోర్డు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయ లేదు? రెండు రాష్ట్రాలు తన్నుకు చస్తుంటే తమాషా చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విషయంలోనే కాదు. వివిధ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రగులుతుంటే పెద్దన్న పాత్ర వహించ వలసిన కేంద్రం ప్రేక్షక పాత్ర వహించిన సందర్భాలు లేక పోలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు లేకున్నా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో కృష్ణ తుంగభద్ర నదులకు గతానికి భిన్నంగా వరద ముందుగానే వచ్చింది.
అప్పుడే శ్రీ శైలం జలాశయం రెండు మార్లు గేట్లు ఎత్తారు. నీళ్లు ఎంతో విలువైనవి. వరద రోజుల్లోనే జలాశయాలను నింపుకోవాలని రెండు రాష్ట్రాలు నీటిని విడుదల చేసుకుంటున్నాయి. పైగా రెండు రాష్ట్రాలు ఎడా పెడా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. వాస్తవంలో యాజమాన్యం బోర్డు సమావేశమై రెండు రాష్ట్రాలకు కోటా నిర్ణయించి ఉంటే ప్రస్తుతం సాగుతున్న ఆరోపణల పర్వం ఉండేది కాదు. అయ్య వారు వచ్చేంత వరకు అమావాస్య ఆగదు కదా? ఎవరికి వారు నీళ్లు విడుదల చేసుకొంటుంటే రెండు రాష్ట్రాల మధ్య రగడకు దారి తీసింది. తెలంగాణ వైపు నుండి రాజకీయ పార్టీల నేతలే కాకుండా మీడియా కూడా భిన్నమైన వార్తలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో అవాస్తవ వార్తలు వెలువడ్డాయి. ఇవి ఉద్రిక్తతలు పెంచే విధంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అసలు ముచ్చు మర్రి ఎత్తిపోతలు మొదలు పెట్ట లేదు. కానీ 6300 క్యూసెక్కులు ఎత్తి పోస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. హంద్రీనీవా ప్రధాన కాలువ గత సంవత్సరం వరకూ రెండు వేలు క్యూసెక్కులకు మించి ప్రవహించే అవకాశం లేదు. ఈ ఏడు విస్తరణ జరిగి 3820 క్యూసెక్కులు ప్రవహించునట్లు చేశారు. ప్రస్తుతం 2500 క్యూసెక్కులు ఈ నెల 15 వతేదీ నుండి రన్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో 6300 క్యూసెక్కులు ఎత్తి పోస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీని కంతటికీ కారణం యాజమాన్య బోర్డు నిర్లక్ష్యం. కనీసం జూన్ ఆఖరులో నైనా బోర్డు సమావేశమై ఎవరి వాటా ఎంత? ఏ పాయింట్ నుండి ఎవరు ఎన్ని టియంసిలు తీసుకోవలసినదీ రెగ్యులేషన్ చార్టు రూపొందించి ఉంటే ఇప్పుడు ఈ అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడేది కాదు కదా?
తొలి నుండి కూడా యాజమాన్యం బోర్డు చురుకుగా వ్యవహరించి నాణ్యమైన టెలీ మెట్రీలు ప్రధాన మైన ముఖ ద్వారాల వద్ద అమర్చి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. యాజమాన్య బోర్డు క్రియాశీలంగా లేకున్నా ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరువురు టెలీ మెట్రీలు ఏర్పాటుకు అంగీకరించడం గుడ్డిలో మెల్ల మేలు చందంగా ఉంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు ఏలా పుట్టుకు వస్తాయో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన నిదర్శనం గా ఉంది . ఈ ప్రకటనలో బనకచర్ల ప్రస్తావన లేదు. ఈ అంశమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకుల విమర్శలకు జవాబుగా చెప్పారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో భిన్నంగా ప్రచారం జరుగుతోంది.
బనకచర్ల అనుసంధానం క్లియర్ చేసేందుకే సాంకేతిక కమిటీ అనే ధోరణిలో ఉంది. ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ప్రేక్షకుడుగా వ్యవహరించడం వెనుక కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి? సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర మంత్రి సి ఆర్ పాటిల్. తమాషా ఏమంటే ముఖ్యమంత్రులే మాట్లాడు కొని సాంకేతిక కమిటీ ప్రతిపాదన ఒకరు చేస్తే మరొకరు బలపర్చి సమావేశం ముగించారు. సోమవారం కల్లా కమిటీ ఏర్పాటు చేయ బడుతుందని చెప్పారు. ఇప్పటికి రెండు మూడు సోమవారాలు గడచి పోయాయి. ఇదంతా పరిశీలించితే తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదుపరి శాసనసభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గల జల వివాదాల్లో అంటీ అంటనట్లు వ్యవహరించునట్లుంది. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా ప్రవర్తిస్తోంది.
-వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు





