భూలోకం లో నందనవనం

గిరియానం .. 4

‘ నందనవనం ‘ గురించి మనం దేవేంద్రడి ఉద్యానవనమని, స్వర్గలోకంలో ఉంటుందని మన ప్రాచీన సాహిత్యంలో చదువుకున్నాం. అది ఆయా కవుల ఊహా వర్ణన. కానీ మనకు భూలోకంలోనే అలాంటి నందనవనం ఒకటి ఉందని నమ్మలేక పోయాను. అదే ‘ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘. తూర్పు పశ్చిమ హిమాలయాల పరిధిలోవుంది. హిమాలయాల ప్రాంతంలో మాత్రమే వికసించే అద్భుతమైన పుష్పాల భూలోక నందనవనం.

సంవత్సరంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అందులోనూ జూలై 15 నుంచి ఆగస్టు 15 తేదీ వరకు పూలు కనువిందు చేస్తాయి. అది కూడా ముందురోజు వెళ్ళిన రోజు వర్షం పడకుండా ఉండాలి. ప్రకృతి మనకు సహరిస్తేనే మనం ఆ అందాలను వీక్షించగలం. మేం కిందికి దిగి వచ్చాక వర్షం మొదలైంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉంది . సముద్ర మట్టానికి 14200 అడుగులో ఎత్తులో వుంది. ఎనిమిది కిలో మీటర్ల దూరం , రెండు కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. 1980లో దానిని సంజయ్ గాంధీ జాతీయ పార్క్ గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 1982లో నందాదేవి జాతీయ పార్క్ గా పేరు మార్చారు. 1988లో యునెస్కో ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించింది. ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజుకు 200 మందికి మాత్రమే ప్రవేశం. పరిరక్షణలో భాగంగా హెలికాఫ్టర్, గుర్రాలకు అనుమతి లేదు. ప్రత్యేక అనుమతి పొందిన పదిమంది బుట్ట మనుషులకు ప్రవేశం ఉందని నేపాలీ బాస్కెట్ వాలా బిక్కీ చెప్పాడు.

మేం ఉదయం ఏడుగంటలకు ప్రవేశ మార్గం వద్ద మా రిజిస్ట్రేషన్ పేర్ల జాబితాను చూపించి లోపలికి ప్రవేశించాం. తిరుగు ప్రయాణంలో కూడా గేటువద్ద మన పేరు సూచించి బయటకు రావడం తప్పనిసరి. తప్పిపోయిన వారిని గుర్తించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. మా ముందు వెనకా yhai వాళ్ళు ఏర్పాటు చేసిన గైడ్స్ తో మా నడక మొదలైంది. మొదట్లో కొంత దూరం స్థానిక మహిళ పుష్ప నాతోపాటు వచ్చింది. అలా రోజూ వెళ్ళి తన గుర్రానికి మేత కోసం పచ్చగడ్డి కోసుకొని తీసుకు వెళతానని చెప్పింది. ఎత్తైన కొండలు, (అక్కడక్కడా ల్యాండ్ స్లైడ్ హెచ్చరిక బోర్డులు) పచ్చని లోయలు, పుష్పవతి నదీ జలపాతాలు, మేఘాలలో నడక.. అప్పుడప్పుడు ఆగుతూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సేదతీరుతూ ప్రాణవాయువును ఊపిరితిత్తుల్లో నింపుకుంటూ ఎన్ని కొండలు ఎక్కి దిగామో తెలియదు. ఎప్పుడెప్పుడు పూలలోయను చేరుకుంటాననే ఉద్విగ్నత నన్ను వడివడిగా అడుగులు వేయించింది.

చివరగా నదీప్రవాహాన్ని దాటాక రెండు ఫర్లారంగుల దూరంలో పూలలోయ ఆవిష్కృతమైంది. అప్పుడు సమయం ఒంటి గంటన్నర. ఒక్కసారిగా భువి నుండి దివి లోకి వచ్చి వాలానన్న అనుభూతి..తెలుపు,గులాబి,పసుపు పువ్వులు ఎక్కువగా వున్నాయి. పూల లోయలోకి వెళుతున్నా కొద్దీ భిన్న వర్ణాల, భిన్న ఆకృతుల పుష్పాలు కనువిందు చేస్తూ అబ్బుర పరిచాయి. ఆనందంగా లోయంతా కలియదిరిగి పెద్ద బండరాయి ఎక్కి కూర్చున్నాను. చుట్టూ చూద్దును కదా.. ప్రశాంత మైన వాతావరణo,పూలలోయ మధ్యలో నేను, ఆ తరువాత పచ్చని చెట్లు, ఎత్తైన పర్వతాలు, వాటిని చుంబిస్తూ మేఘాలు, పైన నీలాకాశం.. ఇంతకన్నా స్వర్గం అందంగా వుంటుందా? ఏమో! సందేహమే..

కాశ్మీర్ గుల్మార్గ్ గార్డెన్స్, మైసూర్ బృందావన్ గార్డెన్స్, మౌంటాబ్ మధుబని, తులిప్ గార్డెన్స్, దుబాయ్ మిరాకిల్ గార్డెన్స్ ఇలా పలు పూలతోటలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి. కానీ అవన్నీ మానవ నిర్మితాలు.. ఎంత అందంగా ఉన్నా అది ముస్తాబుతో వచ్చిన అందం మాత్రమే..హిమాలయాలలోని ప్రకృతి కన్య తనకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సహజ సిద్ధమైన అలంకరణ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అవి ఆ ప్రాంతంలో మాత్రమే విరబూసే అందాలు. వాటిలో నీలం రంగులో చిన్నగా ముద్దుగా వుండే ‘ బ్లూపాపీ ‘ పువ్వు .. ‘ queen of Himalayas అని చెపుతారు. జెరేనియం, మోరినా లాంగ్ ఫోలియా, కాంపసులా లాటిఫోలియా, డాక్టిలోర్జియా హటాగిరియా, ఎరీగేరన్ మల్టీరేడియేటస్ , కస్క్యూటా యురేపియా, బిస్టోరియా అఫినిస్, హిమాలయన్ స్లిప్పర్ ఆర్చిడ్, కోబ్రా లిల్లీ, బ్రహ్మకమలం లాంటి పుష్పాలు అరుదైన రకాలు. మన ప్రాంతంలో పూసే బ్రహ్మకమలం వేరు. అరుదైన ఔషధ మొక్కలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని వివిధ రకాల జబ్బులకు వేసుకునే మందుల తయారీకి ఉపయోగిస్తున్నారు. అక్కడ లభించే పళ్ళతో స్థానికులు జూస్ లు తయారు చేసి విక్రయిస్తారు. వాటి ధర కూడా చౌకగా వుంది.

దారిలో కొండలకు కట్టిన పెద్ద పెద్ద తేనెతుట్టెలు కనిపించాయి. అరుదైన సీతాకోక చిలుకలు, పక్షులు కనిపించాయి. జంతుజాలం తక్కువే అయినప్పటికీ అంతరించి పోతున్న అరుదైన జంతువులు కొన్ని వున్నట్లు గైడ్ సాగర్ చెప్పాడు. మంచు చిరుత, గోధుమరంగు ఎలుగుబంటి, ఎర్ర నక్క, నీలి గొర్రెలు మొదలైనవి ఉన్నాయి. గైడ్ చెప్పిన వివరాల ప్రకారం 1931లో ముగ్గురు పర్వతా రోహకులు ఆ లోయ ప్రాంతంలో దారి తప్పి ఒక రాత్రి అక్కడే నిద్రించారు. తెల్లవారి వాళ్ళు నిద్రలేచి చూసేసరికి ఆ ప్రాంతమంతా భిన్నవర్ణాల పూలతో సాక్షాత్కరించింది. ఆ అందాలకు ముగ్ధులై ఆ ప్రాంతాన్ని వాళ్ళు ‘పూలలోయ ‘ ( Valley of flowers ) అని పిలిచారు. అదే పేరు స్థిర పడింది. ఆ ముగ్గురిలో ఒకరైన ఫ్రాంక్ ఎస్. స్మిత్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పేరుతో పుస్తకాన్ని రాసి ప్రచురించాడు. అలా ఆ ప్రదేశం ప్రచారంలోకి వచ్చింది.

1939లో బోటనీ పరిశోధకురాలు లేడీ జోన్ మార్గరెట్ లెగ్గే అనే మహిళ పరిశోధన నిమిత్తం అక్కడికి వెళ్ళి పూలసేకరణలో ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. తర్వాత కొంత కాలానికి లోయను సందర్శించి ఆ ప్రదేశానికి చేరువలో తన సోదరి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. పూలలోయలో ఒక స్త్రీ స్మారక చిహ్నం ఉండడం గర్వంగా అనిపించింది. 1962లో అక్కడికి రాకపోకలను నిషేధించారు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. తరువాత 1974 అనుమతించారు. కానీ దాని వల్ల జరిగిన పుష్ప క్షీణత వల్ల టూరిస్టులకు ప్రవేశం నిషేధించారు. మళ్ళీ కొంత కాలానికి జాతీయ పర్యావరణ కేంద్రం, ఉత్తరాఖండ్ అటవీ శాఖలు సంయుక్తంగా తగిన జాగ్రత్తలతో ట్రెక్ లను నిర్వహిస్తోంది. అక్కడ ఎలాంటి నివాస స్థలాలు లేవు.

మేం బస చేసిన ఘంఘారియా గ్రామంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ పేరుతో ఒక డాక్యుమెంటరీ సినిమా కూడా అందుబాటులో ఉంది. దానిని భియిందర్ గ్రామంలోని ఎకో డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్మించింది.డైరెక్టర్ చంద్రశేఖర చౌహాన్. నిడివి 30ని.లు.ప్రవేశ రుసుం ఒక్కరికి రూ. 50/. హిందీ, ఇంగ్లీషు భాషలలో అందుబాటులో ఉంది. దానిని చూడడం వల్ల స్థానిక జీవన విధానం, పువ్వులు అధికంగా ఉండే ఆరు వారాలలో ఒక్కొక్కవారం ఒక్కో రకం ( వర్ణం) పువ్వులు ఎక్కువగా వుంటాయని, సమీపంలో వున్న పుష్పవతీనది అలకనందా నదితో సంగమిస్తుందనే విషయాలు తెలుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page