“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.”
గిరియానం – 1
హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం చూసిన తర్వాత కలిగిన బాధ చెప్ప నలవి కాదు. రెండు అంతస్తుల్లో ఉన్న మ్యూజియంలో 6, 7, 8, 10, 11 గదులలో ప్రదర్శించారు. యుద్ధ సమయంలో ఉపయోగించిన ఆయుధాలు, బాంబులు, ట్యాంకర్లు ఉన్నాయి. యుద్ధ సమయంలో జరిగిన సంఘటన లను తెలిపే ఫోటోలు ఉన్నాయి. యుద్ధానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపే చార్టులున్నాయి. ‘ ఏజెంట్ ఆరెంజ్ ‘ అంటే ప్రత్యేకమైన రసాయన దాడివల్ల జరిగిన నష్టాన్ని తెలియజేసీ విభాగం ఉంది. ఆ రసాయన ప్రయోగం పిల్లలు, మహిళల ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అష్టవంకరలుగా పుట్టిన పిల్లలు, వికృతంగా మారిన మనుషుల ఫోటోలు అక్కడ ప్రదర్శనకు పెట్టారు. అది చూసి మేం తీవ్రంగా చలించి పోయాం.
ఉదయమే బయలుదేరి కూ చి టనల్స్ కు చేరుకున్నాం. వాటిని 1940లో ఫ్రాన్స్ యుద్ధ సమయంలో వారిని ఎదుర్కోవడానికి నిర్మించడం మొదలు పెట్టారట. తర్వాత అమెరికా యుద్ధ సమయంలో ( 1955-75 ) వాటిని 250 కిలోమీటర్ల మేర విస్తరించారట. ప్రస్తుతం 120 కిలోమీటర్ల వరకు ప్రదర్శ నకు అందు బాటులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చారిత్రాత్మకంగా భూ గర్భ నెట్ వర్క్. అక్కడ ఆయుధా గారాలు, వాటిని తయారు చేసే కర్మాగారాలు, మీటింగ్ హాల్స్, కమ్యూని కేషన్ సిస్టం, ఆసుపత్రులు, వంటగదులు మొదలైనవి ఉన్నాయి. వంట చేసేటప్పుడు పొగవస్తే శత్రువుకు ఆచూకి దొరికినట్లే. అలాంటపుడు పొగ రాకుండా ఉండడానికి వారు చేసిన ఉపాయాలు అద్భుతంగా ఉన్నాయి. భూగర్భ సొరంగాలలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అందక పోవడం సహజం. అలాంటి సందర్భాలలో కూడా ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన రంధ్రాలతో కూడిన చిన్న చిన్న మట్టి గోపురాలు ఉన్నాయి. అవి పైకి చూడడానికి మన పాముల పుట్టల మాదిరిగా కనిపిస్తాయి.
ఆనాటి సొరంగాలలోకి పర్యాటకులు కూడా వెళ్ళవచ్చు. అయితే ఇరుకు ప్రదేశాలంటే భయం ఉన్నవాళ్ళు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళను వాటిలోకి వెళ్లవద్దని హెచ్చరిస్తారు. మా బృందంలోనుంచి నేను ఒక్కదానినే 2,3 వందల మీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలోకి వెళ్ళాను. అది ఉద్వేగ భరితమైన అనుభవం. యాభైవేల వియత్నాం డాంగ్స్ చెల్లించి, యుద్ధ తుపాకితో మూడు బుల్లెట్లను ప్రయోగించవచ్చు. ఆ ప్రయత్నం మేము ఎవరమూ చేయలేదు. గెరిల్లా ట్రాపింగ్ పద్ధతి కూడా మనలను ఆశ్చర్య చకితులను చేస్తుంది. పైకి చదునుగానే ఉంటుంది. దానిమీద శత్రువు కాలు పెట్టగానే లోపల ఉన్న బల్లాల మీద పడి చనిపోయే వారట.
ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.
వియత్నాంలో చారిత్రాత్మకమైన బెంథన్ మార్కెట్ కు వెళ్ళాం. 1912 లో దాని నిర్మాణం జరిగింది. దాదాపు నూటా పన్నెండేళ్ల చరిత్ర ఉంది. ఇది హోచిమన్ నగరం నడిబొడ్డులో వుంది. నిర్మాణం ఫ్రెంచి వాస్తు శిల్పంతో ఉంది. కళాకృతులు, బ్యాగులు, బట్టలు మొదలు అక్కడ దొరకని వస్తువంటూ లేదు. నేను ఆల్చిప్పలతో చేసిన స్పూన్స్ కొన్నాను. తర్వాత మెకాంగ్ డెల్టా టూరుకు వెళ్ళాం. లాంచీలో గంట ప్రయాణం. ఫ్లోటింగ్ విలేజెస్, ఫోటింగ్ మార్కెట్స్ కనిపించాయి. మెకాంగ్ నదీ డెల్టాలో స్థానికులు తయారు చేసిన వస్తువులు అమ్మకానికి పెట్టారు. కొబ్బరితో తయారు చేసిన అనేక రకాల స్నాక్స్ అక్కడ లభిస్తాయి.
అనేక రకాల తాజా పళ్ళను రుచి చూసాము. ఒకచోట రెండేళ్ళ వయసున్న కొండచిలువను మెడలో వేసుకొని కొందరు విదేశీయులు ఫోటోలు దిగారు. కొన్నిచోట్ల స్థానిక భాషలో స్త్రీ పురుషులు గాన కచేరీ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇండియన్ రూపాయలనే టిప్స్ గా తీసుకున్నారు. ఆ కచేరీలలో అన్ని వయసుల స్త్రీ పురుషులు ఉన్నారు. వియ త్నాంకు ప్రత్యేకమైన కొబ్బరి తోటల మధ్యలో పిల్ల కాలువల్లో చిన్నచిన్న స్థానిక పడవలలో విహారం చేయడం బాగుంది. ఎక్కువగా మహిళలే వాటిని నడుపు తున్నారు. ఇంటా బయటా కూడా మహిళలే ఎక్కువగా కష్టపడుతున్నారని వాళ్లతో మాట్లాడినప్పుడు తెలిసింది. సాయంత్రం దాకా ఆ డెల్టాలో గడిపి, లాంచీలో తీరం చేరుకొని, డిన్నర్ ముగించి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాం. అక్కడితో మా ఆరు రోజుల వియత్నాం పర్యటన ముగిసింది. తెల్లవారి మధ్యాహ్నాం హైదరాబాదుకు చేరుకున్నాం.





