భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు
గణేష్ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ పార్థివదేహాన్ని అతని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు తీసుకువచ్చారు. గ్రామంలో ఉదయం నుంచి ప్రజలు రవి ఇంటికి వచ్చి ఆయన పార్థివ దేహానికి అశ్రునివాళులర్పిస్తున్నారు. విప్లవ ప్రజా సంఘాల నాయకులు విరసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చి రవికి ఘనంగా నివాళులర్పించారు.
జనసంద్రంగా మారిన వెలిశాల
రవి మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులతోపాటు విప్లవ సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజా ఉద్యమాలతో అనుబంధం ఉన్న వారందరూ గణేష్‌కు కడసారి నివాళులర్పించేందుకు వెలిశాలకు భారీగా తరలివచ్చారు. కాగా, రవి పార్థివ దేహానికి గ్రామంలోని శ్మశానవాటికలో మధ్యాహ ్నం అంత్యకియ్రలు పూర్తయ్యాయి. అంతకుముందు గ్రామంలో అంతిమ యాత్ర భారీగా నిర్వహించారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే
రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆయన ఇంటికి వెళ్లి మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు.





