ట్రంప్‌ చెడుగుడుకు చైనా స్నేహమే విరుగుడు

“జాతీయవాదం పునాది మీద ఉద్వేగ రాజకీయాలు నడపడం పులిమీద సవారీ లాంటిది. యాభై ఆరు అంగుళాల ఛాతీతొ దృఢమైన నాయకుడిగా గుర్తింపు పొందిన దేశాధినేతకు, ఆచరణాత్మక రాజకీయాలు నడపవలసి రావడం కత్తిమీద సాము. అంతా సజావుగానే ఉన్నప్పుడు, ఒక నిర్హేతకమైన ధైర్యంతో, యథేచ్ఛగా మాట్లాడి, తరువాత తరువాత పరిస్థితి తారుమారయినప్పుడు, నంగి నంగిగా వ్యవహరించి, సవారీ చాలిస్తే – పులి మింగేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలతో అమెరికా ఆడుకుంటున్న చెడుగుడులో భారత్‌ కు అటువంటి సంకట స్థితే ఎదురవుతున్నది. ధిక్కరించలేదు, దీనంగా మిగలలేదు. ఈ స్థితిలో ఒకరికిద్దరు తోడు అవసరం. నిన్నటిదాకా నిందించుకున్న వారితో అయినా స్నేహాలు అవసరం.”

ఏడేళ్ల తరువాత మోదీ చైనా వెళ్లారు. రెండు దేశాల మధ్య సహకారం ఎంత అవసరమో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నిలకడ అందించడానికి రెండు పెద్ద దేశాల మీద ఎంత బాధ్యత ఉన్నదో చెప్పారు. షాంఘై సహకారసంస్థ సదస్సు ప్రసంగాలలో, చైనా అగ్రనేతతో ముఖాముఖి చర్చల సందర్భంగా ఇంకెన్ని స్నేహ వచనాలు వెలువడుతాయో తెలియదు. గాల్వాన్‌ ఘర్షణల అనంతర స్తబ్ధత తరువాత ఈ ఆకస్మిక ప్రేమలకు కారణం, బాధితుల మధ్య ఉండే బంధం. అమెరికా అధ్యక్షుడు మొదలుపెట్టిన సుంకాల యుద్ధం.

జాతీయవాదం పునాది మీద ఉద్వేగ రాజకీయాలు నడపడం పులిమీద సవారీ లాంటిది. యాభై ఆరు అంగుళాల ఛాతీతొ దృఢమైన నాయకుడిగా గుర్తింపు పొందిన దేశాధినేతకు, ఆచరణాత్మక రాజకీయాలు నడపవలసి రావడం కత్తిమీద సాము. అంతా సజావుగానే ఉన్నప్పుడు, ఒక నిర్హేతకమైన ధైర్యంతో, యథేచ్ఛగా మాట్లాడి, తరువాత తరువాత పరిస్థితి తారుమారయినప్పుడు, నంగి నంగిగా వ్యవహరించి, సవారీ చాలిస్తే – పులి మింగేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలతో అమెరికా ఆడుకుంటున్న చెడుగుడులో భారత్‌ కు అటువంటి సంకట స్థితే ఎదురవుతున్నది. ధిక్కరించలేదు, దీనంగా మిగలలేదు. ఈ స్థితిలో ఒకరికిద్దరు తోడు అవసరం. నిన్నటిదాకా నిందించుకున్న వారితో అయినా స్నేహాలు అవసరం.

జాతీయవాదానికి బలమైన బాహ్యశత్రువు కూడా అవసరం. పాకిస్థాన్‌ కునారిల్లిపోయి ఉన్నస్థితిలో భావోద్వేగాలు తగినంతగా పండని స్థితి ఏర్పడినప్పుడు, మనదేశంలో చైనా ప్రతినాయక స్థానంలోకి వచ్చి చేరింది. చైనాలో గొప్పగా చెప్పుకోవలసిన ఆదర్శాలు ఏమీ పెద్దగా మిగలలేదు.దానికి ఆర్థిక వాణిజ్యరంగాలలో విస్తరణ ఉద్దేశాలు లేవని కానీ, సరిహద్దు వివాదాలలో సాత్వికమైనదని కానీ ఎవరూ అనలేరు. అయితే, దాదాపు నాలుగుదశాబ్దాలుగా చైనా ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో పెద్దగా చొరవ, ఆసక్తి చూపడం లేదు. అంతర్గతంగా అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చింది. సొంత సైనిక పాటవాన్ని, శాస్త్రవిజ్ఞానరంగాలలో సామర్థ్యాలను ఒక వైపు పెంచుకుంటూనే, అంతర్జాతీయ వేదికల మీద పరిమితంగా వ్యవహరిస్తూ వచ్చింది. రెండు గల్ఫ్‌యుద్ధాలలోను, ఆప్ఘనిస్థాన్‌ యుద్ధంలోను, అనేక ఇతర వివాదాల్లోనూ అతి తక్కువగా తన వైఖరులను చెప్పడం, అమలుచేయడం చేస్తూ వచ్చింది. పాకిస్థాన్‌ వంటి మిత్రదేశాలకు అవసరమైనప్పుడు తన పలుకుబడిని అడ్డువేయడం తప్ప, అగ్రరాజ్యాల ఆక్రమణలను చూసీచూడనట్టుగా వదిలేసింది. భారత్‌ తో కూడా దానికి దీర్ఘకాలం ఎటువంటి సమస్యలూ లేవు, పైగా, 1962 లో ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నమే రెండుదేశాలూ చేస్తూ వచ్చాయి. కానీ, చైనా ఆర్థిక, వాణిజ్య విస్తరణను, సైనికశక్తి వృద్ధిని చూసి అమెరికా అభద్రతకు లోనవడం మూడుదశాబ్దాల కిందట మొదలయింది. తన వాణిజ్యశక్తి ద్వారా అంతర్జాతీయరంగంలో బహుధ్రువ అధికారకేంద్రాలను స్థాపించాలన్న చైనా ప్రయత్నం నిశ్శబ్దంగా కొనసాగుతూ వచ్చింది.

‘”అబ్‌కీ బార్‌ ట్రంప్‌కీ సర్కార్‌’ అని అమెరికాలో కూడా ప్రచారం చేయడానికి ఉత్సాహపడిన నరేంద్రమోదీ, అంతర్జాతీయ రాజకీయాల చలనగతిని అర్థం చేసుకోలేకపోయారు. అమెరికా అయినా, భారత్‌ అయినా రైటిస్టు శక్తులు ఒకరికొకరు మిత్రులేనని భ్రమపడ్డారు. వంగతోట కాడ మాత్రం ఎవరూ బావలు కారని ట్రంప్‌ కుండబద్దలు కొట్టారు. పొరుగుదేశాలతో వ్యవహరించవలసిన తీరు కానీ, వేరువేరు భౌగోళికరాజకీయ సంబంధాలలోని ఆంతర్యం కానీ మోదీకి, ఆయన మిత్రులకు జాతీయవాద ఉత్సాహంలో అర్థం కాలేదు. చైనాకు వ్యతిరేకంగా నిలబడమని తనని ప్రోత్సహించే అమెరికా, చైనాతో గాఢ మైత్రిలో ఉన్న పాకిస్థాన్‌ తో ఎందుకు నిరభ్యంతరంగా స్నేహం చేస్తుందో తెలుసుకోలేకపోయారు.”

అయితే, ప్రపంచస్థాయిలో తనను బలహీనపరచడం మాత్రమే కాదు, ఆసియాలో అగ్రరాజ్యంగా ఎదుగుతున్నది, జాగ్రత్త- అంటూ అమెరికా భారత్‌ వంటి దేశాలను హెచ్చరిస్తూ వచ్చింది. చైనాకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం ఉభయతారకంగా ఉంటుందని నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ట్రంప్‌ మొదటి హయాంలో ఉధృతంగా జరిగాయి. దానికి మన ప్రభుత్వం కూడా సుముఖతతో స్సందించింది. వాస్తవ శక్తిసామర్థ్యాతో, ప్రయత్నాలతో నిమిత్తం లేకుండా, ఆసియాలో తానొక బలమైన శక్తిగా, చైనాకు దీటుగా నిలబడాలన్న ఆశ భారత్‌ కు కూడా ఎప్పటి నుంచో ఉన్నది. అమెరికా అండతో, తాను చైనాకు ఒక స్పీడ్‌ బ్రేకర్‌ కాగలనని, అది ప్రపంచ రాజకీయాలలో తన ప్రాముఖ్యం పెంచుతుందని భారత్ ఆశించి కూడా ఉండవచ్చు. చైనాతో స్పర్థకు ఎంతదాకా వెళ్లిందంటే, భారతదేశంలో తనకు విమర్శకులుగా ఉన్న సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, చైనా ప్రోద్బలంతో పనిచేస్తున్నారని ఆ కాలంలో ప్రభుత్వం అభియోగాలు మోపింది. మీడియాసంస్థల మీద కూడా కేసులు వేసింది. కమ్యూనిస్టులతో సహా అనేక అభిప్రాయాల విమర్శకులను చైనా సమర్థకులుగా, చైనా డబ్బుతో పనిచేస్తున్నవారిగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగింది.

భారతదేశంలో అంతర్గతంగా ఉన్న భావవాతావరణానికి ‘చైనా బూచి’ ప్రచారానికి సమన్వయం బాగానే కుదిరింది. పెట్టుబడిదారీ విధానాన్ని వరించి, కమ్యూనిజాన్ని విసర్జించినప్పుడే, రాజకీయాల ఎగుమతిని, భావజాలాల ప్రచారాన్ని చైనా వదిలేసింది. ఏ దేశంలో అయినా అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే పనులను కానీ, ప్రతిపక్షాలకు అండదండలిచ్చే పని కానీ చైనా కొన్ని దశాబ్దాలుగా చేయడమే లేదు. అది తక్కిన ప్రపంచంతో వాణిజ్య, ఆర్థిక రంగాల ద్వారా మాత్రమే ప్రధానంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనా ను ఇంకా సోషలిస్టు దేశమని, ఆ దేశం విధానాలు ఆదర్శవంతమైనవనీ అమాయకంగా నమ్మే కమ్యూనిస్టులు మనదేశంలో ఉన్నారు కాబట్టి, విమర్శకులందరినీ చైనా అనుకూలురని నిందించడం సులభమైంది.

చైనాను ఢీకొంటామని గాంభీర్యం ప్రకటించడం జరిగింది కానీ, ఒక వాస్తవ ఘర్షణ జరిగేసరికి, ప్రభుత్వ స్పందన అందుకు దీటుగా లేకపోయింది. వాస్తవ సమాచారానికి, ప్రభుత్వం చెప్పేదానికీ వైరుధ్యాలు కనిపించసాగాయి. ప్రతిపక్షాల విమర్శ తీవ్రమైంది. రాహుల్‌ గాంధీ అయితే, మొన్నటికి మొన్న చైనా మనభూమిని ఆక్రమించినా ప్రభుత్వం కిమ్మనకుండా ఉన్నదని మరోసారి ఆరోపించారు. టిక్‌ టాక్‌ ను, ఏవో చైనా యాప్స్‌ను నిషేధించడం తప్ప వాస్తవంగా ఆ దేశం మీద ఎటువంటి ఒత్తిడీ తేలేకపోవడం ప్రభుత్వ బలహీనతను చాటి చెప్పింది.

‘అబ్‌కీ బార్‌ ట్రంప్‌కీ సర్కార్‌’ అని అమెరికాలో కూడా ప్రచారం చేయడానికి ఉత్సాహపడిన నరేంద్రమోదీ, అంతర్జాతీయ రాజకీయాల చలనగతిని అర్థం చేసుకోలేకపోయారు. అమెరికా అయినా, భారత్‌ అయినా రైటిస్టు శక్తులు ఒకరికొకరు మిత్రులేనని భ్రమపడ్డారు. వంగతోట కాడ మాత్రం ఎవరూ బావలు కారని ట్రంప్‌ కుండబద్దలు కొట్టారు. పొరుగుదేశాలతో వ్యవహరించవలసిన తీరు కానీ, వేరువేరు భౌగోళికరాజకీయ సంబంధాలలోని ఆంతర్యం కానీ మోదీకి, ఆయన మిత్రులకు జాతీయవాద ఉత్సాహంలో అర్థం కాలేదు. చైనాకు వ్యతిరేకంగా నిలబడమని తనని ప్రోత్సహించే అమెరికా, చైనాతో గాఢ మైత్రిలో ఉన్న పాకిస్థాన్‌ తో ఎందుకు నిరభ్యంతరంగా స్నేహం చేస్తుందో తెలుసుకోలేకపోయారు. అటు ‘క్వాడ్‌’తోను, ఇటు ‘బ్రిక్స్‌’లోను ఉండగలిగే చాతుర్యాన్ని అమెరికా ఎంతో కాలం సహించబోదని ఊహించలేకపోయారు. కుడివాదపు అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉండేదంటే, మన విదేశాంగ మంత్రి జయశంకర్‌ కనీస దౌత్య ఔచిత్యం లేకుండా మాట్లాడేవారు. చివరకు అమెరికా మీద కూడా యథేచ్ఛగా వ్యాఖ్యానించారు. వాటిని చూసీచూడనట్టు ఊరుకుంది కానీ, ఆ తరువాత అమెరికా తనేమిటో చూపడం మొదలుపెట్టింది.

ప్రపంచంలో ఇప్పటికీ ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి స్నేహాలే మనకు ఎంతో కొంత అండగా ఉంటున్నాయి తప్ప, కొత్త ఆకర్షణల వల్ల పెద్ద ఉపయోగం ఉండడం లేదని అనుభవమే చెబుతున్నది. వెన్నెముక కొంచెం మిగిలిఉన్న చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో సహప్రయాణమే అగ్రరాజ్య ఒత్తిడుల నుంచి ఉపశమనం ఇస్తున్నది. సోవియట్‌ యూనియన్‌ ఇప్పుడు లేకపోవచ్చును కానీ, రష్యాతోనూ, కొంతవరకు ఉక్రెయిన్‌ తోనూ కూడా మనం లబ్ధిని పొందగలుగుతున్నాం.

రష్యా నుంచి, ఇరాన్‌ నుంచి చమురును కొనగూడదు. బ్రిక్స్‌ లో ఉండకూడదు. తమ దేశం నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తులు కొనాలి వంటి ఆర్థిక ఆకాంక్షలనే కాదు, తనకు నోబెల్‌ బహుమతి ఇప్పించే కర్తవ్యాన్ని కూడా ట్రంప్‌ భారత్‌ మీద మోపారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని తన సామ్రాజ్యవాద అవసరాలకు లోబడి మాత్రమే పరిగణిస్తున్న ట్రంప్‌, చరిత్రలోనే అత్యంత అమానవీయ యుద్ధాన్ని సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు అండదండలు అందిస్తున్న ట్రంప్‌, భారత్-పాక్‌ యుద్ధాన్ని ఆపినందుకు శాంతిదూత బిరుదు కోరుకుంటున్నారు. అంతా బాగుంటే సహకరించేవారేమో మోదీ, కానీ, జాతీయవాద ఉద్వేగాలు అందుకు అనుమతించడం లేదు. ట్రంప్‌ మాటలను ప్రతిసారీ ఖండిస్తున్నప్పటికీ, ఫలితం ఉండడం లేదు. పాక్ తో యుద్ధాన్ని విరమించడానికి నరేంద్రమోదీ చెప్పిన కారణాన్ని ఎంతమంది నమ్ముతున్నారో, తన జోక్యం వల్లనే ఆగిందని ట్రంప్‌ చెప్పుకుంటున్నదాన్ని కూడా దాదాపుగా అంతేమంది నమ్ముతున్నారని ఇండియా టుడే తాజాగా చేసిన సర్వేలో తేలింది. ఈ సమయంలో అమెరికా ఆర్థిక ఒత్తిడులకు తగ్గి, సుంకాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అది రాజకీయంగా మరింత నష్టం కలిగిస్తుంది. పైగా, ట్రంప్‌ దూకుడుకు, అదానీమీద కేసులకు సంబంధం ఉన్నదన్న అభిప్రాయాలు బలంగా సంచరిస్తున్నాయి కూడా.

“ప్రపంచం అంతటి మీదా సుంకాలను గుప్పిస్తున్నప్పటికీ, అమెరికా ప్రత్యేకంగా గురిపెడుతున్నది భారత్‌ మీదనే. యాభైశాతం సుంకాలతో భారతీయ ఎగుమతిదారులను, అనేక రంగాల ఉపాధిని దెబ్బతీస్తున్న ఈ సుంకాల దాడిని భారత్‌ గట్టిగా ఎదుర్కొనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందున్న పెద్ద సవాల్‌. అమెరికా ఒత్తిడికి భారత్‌ చలించకుండా నిలబడాలని ఇండియాటుడే తాజాగా చేసిన సర్వేలో 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంతకాలం ప్రదర్శించిన దేశభక్తిని ఇప్పుడు ఆచరణలో నిరూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన ప్రతాపం పాకిస్థాన్‌ తో మాత్రమేనా? ఇందిర లాగా అమెరికా ఎదుట నిలబడలేరా? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది.”

ప్రపంచం అంతటి మీదా సుంకాలను గుప్పిస్తున్నప్పటికీ, అమెరికా ప్రత్యేకంగా గురిపెడుతున్నది భారత్‌ మీదనే. యాభైశాతం సుంకాలతో భారతీయ ఎగుమతిదారులను, అనేక రంగాల ఉపాధిని దెబ్బతీస్తున్న ఈ సుంకాల దాడిని భారత్‌ గట్టిగా ఎదుర్కొనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందున్న పెద్ద సవాల్‌. అమెరికా ఒత్తిడికి భారత్‌ చలించకుండా నిలబడాలని ఇండియాటుడే తాజాగా చేసిన సర్వేలో 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంతకాలం ప్రదర్శించిన దేశభక్తిని ఇప్పుడు ఆచరణలో నిరూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన ప్రతాపం పాకిస్థాన్‌ తో మాత్రమేనా? ఇందిర లాగా అమెరికా ఎదుట నిలబడలేరా? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది.

ప్రజల ఆలోచనలు జాతీయవాద దేశభక్తితో ఉంటే, ఆర్థికరంగ నిపుణులు, వ్యాఖ్యాతలలో అత్యధికులు అమెరికా కేంద్రిత ప్రవచనాలే ఇస్తున్నారు. “ఇప్పుడేదో అవసరార్థం చైనాతో చెలిమి చేస్తే ఓకే కానీ, దీర్ఘకాలికంగా అమెరికాను దూరం చేసుకోగూడదు. చైనా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సుంకాల తాకిడిని తట్టుకోవడానికి మరిన్ని కార్మిక సంస్కరణలు తేవాలి, భవిష్యత్తులో ఇటువంటి బెదిరింపులను తట్టుకోవడానికి వీలుగా, చైనా చేసిన మాదిరి తయారీ పరిశ్రమలను అభివృద్ధి చేసుకుని, పరాధీనత తగ్గించుకోవాలి”- వంటి సూక్తులు చాలా మంది చెబుతున్నారు. స్వావలంబనను పెంచుకోవాలనడం మంచిమాటే. షాంఘై సదస్సులో మోదీ, మేక్‌ ఇన్‌ ఇండియా లో పాల్గొనమని విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. అంతే తప్ప, దేశీయ మానవ, ప్రాకృతిక వనరులను సద్వినియోగం చేసుకుని, స్వదేశంలో సకలరంగ పరిశ్రమలను వృద్ధి చేసే తలపోత మాత్రం ఇప్పటికీ జరగడం లేదు.

మితిమీరిన శక్తి కేంద్రీకరణ, ఎప్పటికైనా ప్రమాదమే. ఆ రకంగా చైనా నుంచి కూడా మనకూ ప్రపంచానికీ ప్రమాదం ఉన్నది. చైనా పెట్టుబడులు విస్తరించిన ఆఫ్రికా, దక్షిణఅమెరికా, ఆసియా దేశాలను గమనిస్తే, ఆయా దేశాల పరాధీనత, రుణభారం ఎంత పెరుగుతున్నదో అంచనా వేయవచ్చు. కానీ, ప్రస్తుత దశలో, అమెరికా దాడినుంచి రక్షించుకోవడానికి భారత్‌కు చైనా స్నేహం అవసరం. రష్యాకూడా అందుకోసమే చైనాతో కలసి ప్రయాణిస్తున్నది. ఈ భౌగోళిక రాజకీయాల గమనాన్ని ముందే గుర్తించి ఉంటే, అమెరికా గురించి అత్యుత్సాహపు అవాకులు, చైనా గురించి ప్రతికూల చెవాకులు మాట్లాడకుండా భారత్‌ జాగ్రత్త పడి ఉండేది. అమెరికా మొదలుపెట్టిన సుంకాలదాడిని ఎదుర్కొనాలంటే, భారత్‌తో జట్టు కట్టాలని చైనా గత మార్చిలోనే గ్రహించి, చొరవ చూపించింది. ఆ స్నేహహస్తం అనేక రంగాలకు విస్తరించి, మూడో ప్రపంచ దేశాల ఐక్యతకు ఉపయోగపడాలి. మోదీ చెబుతున్ననూతన ప్రపంచ వ్యవస్థ అదే అయితే, దానిని ఆహ్వానించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *