– డాక్టర్ జయశంకర్ స్మారకోపన్యాసంలో ప్రొఫెసర్ నరసింహారెడ్డి
కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ(Telangana) సమాజం అభివృద్ధి కోసం ప్రజలకు ఉచిత విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా అందించాలని సెంట్రల్ యూనివర్సిటీ (Central University) ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya university) సెనేట్ హాల్‌లో వైస్ చాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్ కె.జయశంకర్ 13వ స్మారక సమావేశం జరిగింది. డెవలప్‌మెంట్ డిసపరేటివ్ అండ్ ద పర్‌ఫార్మెన్స్ ఆఫ్ ద సోషల్ సెక్టార్ ఇన్ ద సదర్న్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే అంశంపై ప్రొఫెసర్ నరసింహారెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. డాక్టర్ జయశంకర్ సామజిక ప్రజాస్వామ్య తెలంగాణ గురించి కలగన్నారన్నారు. ఆయనను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. న్యాయం కోసం, అసమానతల తొలగింపునకు ఆయన కృషి చేశారని కొనియాడారు. అభివృద్ధి అంటే మౌలిక వసతులు, తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తి మాత్రమే కాదని, విద్య, ఆరోగ్యం ద్వారా మాత్రమే శ్రేయస్సు సాధ్యమని చెప్పారు. ఆ దిశగా రాష్ట్రాలు అడుగులు వేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణా కొన్నింట వెనుకబడి ఉందన్నారు. యువతలో నైపుణ్యాల సామర్ధ్య లోపం ఉందని ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అన్నారు. ప్రాథమిక స్థాయిలో అభ్యాసన, పఠనం పెరగాలన్నారు. ప్రాథమిక విద్యలో మాత్రమే కాదు ఉన్నత విద్యలో కూడా అదే గణాంకాలు కనపడుతున్నాయన్నారు. ప్రజల జీవన నాణ్యతతోనే నిజమైన శ్రేయస్సు అని అన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశగా లక్ష్యాలు ఉండాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ జయశంకర్ గొప్ప మానవతావాది అని, దూరదృష్టి గల వ్యక్తి అని కొనియాడారు. జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో 12 స్మారక ఉపన్యాసాలు విశ్వవిద్యాలయ సహకారంతో నిర్వహించామన్నారు. విశ్వవిద్యాలయంలో జయశంకర్ పేరిట గోల్డ్ మెడల్ ఏర్పాటు చేశామన్నారు. విశ్వవిద్యాలయం ప్రస్తుత అంశాలపై నిరంతరంగా స్మారక ఉపన్యాసాలు నిర్వహించాలని సూచించారు. విశ్రాంత కామర్స్ విభాగ ఆచార్యులు, మాజీ రిజిస్ట్రార్, డాక్టర్ జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ ఆచార్య ఎ.శంకరయ్య మాట్లాడుతూ జయశంకర్ గొప్ప పరిపాలనా దక్షుడన్నారు. వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి తన అధ్యక్ష ఉపన్యాసంలో కాకతీయ విశ్వవిద్యాలయం అకడమిక్‌గా చాలా ముందుకు వెళుతోందన్నారు. ఉన్నత విద్యలో విశ్వవిద్యాలయం తన ప్రాధాన్యత కొనసాగిస్తూ తెలంగాణాలో తన స్థాన్నాని ఉన్నతం చేసుకుంటున్నదన్నారు. సభ ప్రారంభంలో డాక్టర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


