– ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ దాడులు
– ఈడీ దాడులపై మండిపడ్డ బెంగాల్ సిఎం మమత
న్యూదిల్లీ, జనవరి 8: ఒక వ్యవస్థీకృత ముఠా నిర్వహిస్తున్న నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఆరు రాష్ట్రాల్లో సోదాలు జరిపింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్, మొతిహరి, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, కేరళలోని ఎర్నాకులం, పండలం, అడూర్ మరియు కోడూర్, తమిళనాడులోని చెన్నై, గుజరాత్‌లోని రాజ్‌కోట్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ మరియు లక్నోలోని 15 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేలో మొదట ఈ కుంభకోణాన్ని గుర్తించినప్పటికీ, అటవీ, పోస్ట్, ఐటి, హైకోర్టు, ప్రజా ప్రనుల శాఖ, బీహార్ ప్రభుత్వం, దిల్లీ అభివృద్ధి అథారిటీ, రాజస్థాన్ సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ సంస్థలు సహా 40కి పైగా విభాగాల్లో ఈ స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ ముఠా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లను అనుకరిస్తూ నకిలీ ఇమెయిల్ ఖాతాలను వినియోగించి మోసపూరిత జాయినింగ్ లెటర్స్ పంపిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నమ్మించేందుకు రైల్వేలు, ఇతర సంస్థల్లో నియమించిన కొంతమంది బాధితులకు ఈముఠా రెండు నుండి మూడు నెలల వరకు జీతాల చెల్లింపులు కూడా చేశాయని అన్నారు. కొల్‌కతాలో కొనసాగుతున్న ఈడీ దాడులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు రాజకీయ ప్రేరేపితమని, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో జరిగిన సోదాల్లో ఇడి అధికారులు టిఎంసి హార్డ్ డిస్క్‌లు, అంతర్గత పత్రాలు, రహస్య డేటాను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. జైన్ నేతృత్వంలోని కన్‌స్టలెన్సీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఐటి సెల్‌ను కూడా ఐ-ప్యాక్ నిర్వహిస్తోంది. అధికార పార్టీ అంతర్గత వ్యూహం, అభ్యర్థుల జాబితాలు, గోప్యమైన డిజిటల్ మెటీరియల్‌ను ఇడి యాక్సెస్ చేసేందుకు యత్నిస్తోందని, ఆ సమాచారానికి, ఆర్థిక దర్యాప్తుతో సంబంధం లేదని అన్నారు. తమ పార్టీ వ్యూహం, ప్రణాళికలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను తీసుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల అంతర్గత పత్రాలను సేకరించడం ఇడి పనా అని కేంద్రాన్ని నిలదీశారు. ఈ పక్రియు బెదిరింపుగా అభివర్ణించారు. ఇది చట్ట అమలు సంస్థ కాదని, రాజకీయ ప్రతీకారమని అన్నారు. హోంమంత్రి దేశాన్ని రక్షించే వ్యక్తిలా కాకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





