విషాద యాత్రగా మారిన విహార యాత్ర

  • రంగనాయకసాగర్‌ ‌లో నలుగురు గల్లంతు
  • ఇద్దరి మృతదేహాల వెలికితీత,
  • మరో ఇద్దరిని కాపాడిన స్థానికులు

వేసవి కాలం సెలవులను ఎంజాయ్‌ ‌చేద్దామనుకొని వొచ్చిన ఓ రెండు కుటుంబాలలో తీరని విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర ఊహించని విధంగా  విషాద యాత్రగా మారిపోయింది. సిద్ధిపేట-చంద్లాపూర్‌లో గల రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. రంగనాయకసాగర్‌లో సేద తీరేందుకు వొచ్చిన వారిలో నలుగురు రిజర్వాయర్‌లో గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఒక బాలుడు, బాలిక మాత్రం మృత్యువాతపడ్డారు.

వివరాల్లోకి వెళ్లితే… హన్మకొండ జిల్లా కాజీపేటకు చెందిన రెండు కుటుంబాలు (13మంది) ఇన్నోవా వాహనాలలో హైదరాబాద్‌ ‌వెళ్తూ మార్గమధ్యలో ఉన్న రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌చూసేందుకు శనివారం మధ్యాహ్నం వొచ్చారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ఈత కొట్టే నిమిత్తం రిజర్వాయర్‌లోకి దిగారు.  గల్లంతయిన పాప (13)ను కాపాడే యత్నంలో మిగతా వాళ్లు కూడా గల్లంతయ్యారు.

అయితే, స్థానికులు మాత్రం ఇద్దరిని కాపాడగలిగారు. మెహరాజ్‌(13), అర్భాజ్‌(15) ‌మృతదేహాలను వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సిద్ధిపేట ఏసిపి  మధు మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదం ఎలా జరిగింది ఆరా తీశారు. ప్రమాదాల నివారణ గురించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *