అర్ధరాత్రి అవస్థలకు ఇక చెక్

– గిరిజన బిడ్డల ప్రాణాలకు మంత్రి పొంగులేటి భరోసా
– తిరుమలాయపాలెంలో ఏరియా హాస్పిటల్‌కు శంకుస్థాపన

తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 5: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సుమారు రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల హాస్పిటల్ భవన నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. గతంలో కేవలం 30 పడకలతో అరకొర వసతులతో ఉన్న ఈ హాస్పిటల్ వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులను మంత్రి గుర్తు చేసుకున్నారు. ‘నాడు ప్రసవం కావాలన్నా, అత్యవసర చికిత్స కావాలన్నా ఖమ్మం ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం వచ్చాక జిల్లా కేంద్ర హాస్పిటల్‌ను మరిపించేలా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. డయాలసిస్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్యాన్ని రాబోయే కొద్ది నెలల్లోనే ఇక్కడ అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.

వైద్యులు స్థానికంగా ఉండాల్సిందే

వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టవచ్చు.. కానీ డాక్టర్ అందుబాటులో ఉంటారనే నమ్మకం రోగికి కలిగినప్పుడే ఆ హాస్పిటల్‌కు సార్థకత ఉంటుందని మంత్రి పొంగులేటి అన్నారు. డాక్టర్లు, సిబ్బంది ఎక్కడో ఉండటం కాదు.. ఈ హెడ్ క్వార్టర్స్‌లోనే నివసించాలని స్పష్టం చేశారు. చర్ల, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని, ఇక్కడా అదే అంకితభావం కావాలంటూ విధుల్లో చిత్తశుద్ధి చూపే సిబ్బందికి తన నియోజకవర్గం తరపున ప్రత్యేక బహుమతులు అందజేస్తానని ప్రకటించారు. కాగా, మార్చిలో పనులు మొదలవుతున్నాయి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి డిసెంబర్ నాటికే ఈ హాస్పిటల్‌ను ప్రారంభించాలి అని కాంట్రాక్టర్‌కు గడువు విధించారు. అనంతరం మంత్రి పొంగులేటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *