వన దేవత.. నేడు జన దేవత

– మేడారానికి తరలివస్తున్న లక్షలాది భక్తజనం
– భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం
– క్యూలైన్లలో భక్తుల బారులు
– ప్రశాంతంగా సాగుతున్న తల్లుల దర్శనాలు

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. పసుపుకుంకుమలే వజ్రాభరణాలుగా.. బెల్లమే నిలువెత్తు బంగారంగా.. ఒడి బియ్యమే పరమాన్నంగా.. చీర ముక్క, రైక బట్టలే సారెలుగా… తల్లులకు సమర్పించేందుకు తన్మయత్వంతో తరలివచ్చే తెలంగాణ జాతర మేడారం జాతర. వన దేవత.. మన దేవత.. జన దేవత అంటూ అపార నమ్మకాన్ని నింపుకుని కోట్లాది హృదయాలను ఏకం చేసే మహా జాతర మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతర మూడో రోజుకు చేరుకోవడం, రేపటితో ముగియనుండడంతో దేశం నలువైపుల నుండి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నిన్నటి వరకు నిర్మానుష్యపు వనం.. నేడు జన వనంగా మారింది. క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించే భక్తులతో సందడి నెలకొంది. ఇసుకవేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. గద్దెల వద్ద అమ్మలను ఎప్పుడు దర్శించుకుందామా అనే ఆతత క్యూలైన్లలో నిలబడిన భక్తుల్లో నెలకొంది. వారిని నియంత్రించడంలో సిబ్బంది, వలంటీర్లు శ్రమించాల్సి వస్తోంది. జాతరలో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.క్యూ లైన్ల వద్ద వలంటీర్లు వివిధ సేవలు అందిస్తుండగా వైద్య, రక్షణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఎంతమంది భక్తులు వచ్చినా రద్దీని తట్టుకునేందుకు అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు జుయల్ ఓరం, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ సీÓతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు గురువారం తల్లులలను కుటుంబ సమేతంగా దర్శించుకుని వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్నారని తెలుస్తోంది.ఈమేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటితో జాతర ముగియనున్నందున వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *