– కొండగట్టు ఆలయ భూముల వివాదాన్ని పరిష్కరించండి
– ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్ రామచందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 :కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసు జారీ ఆందోళన కలిగిస్తున్నదని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్మానికి ప్రతీక అయిన ఆలయంపై ఈ తరహా చర్యలు హిందూ భక్తుల విశ్వాసాలపై దాడిగా బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి, ఆలయ ఆవరణలో 6 ఎకరాల భూమి పరిమితి అంటూ కొత్త వాదనను తీసుకురావడం భక్తులకు ఆవేదన కలిగిస్తోందన్నారు. అటవీ శాఖ క్లెయిమ్ చేస్తున్న 6 ఎకరాల స్థలంలోనే భక్తులకు అత్యంత అవసరమైన అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, ఆగమ పాఠశాల, వేద విద్యార్థుల వసతి గృహం వంటి కీలక మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. మరోవైపు ఎండోమెంట్ కూడా అటవీ శాఖ కు నోటీసులు ఇచ్చిందని, ఆలయ భూముల విషయంలో ఆలయ, అటవీ శాఖ మధ్య వివాదం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను, వివాదాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే జైలు శిక్ష పడే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం మతపరమైన కట్టడాలనైనా కూల్చివేసే అధికారం అటవీ శాఖకు ఉందని నోటీసుల్లో పేర్కొనడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రామచదర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా కొండగట్టు ఆలయంలో నిత్యం జరిగే వాహన పూజలు, గిరి ప్రదక్షిణ, భక్తుల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లు ఈ 6 ఎకరాల స్థలంతో నేరుగా ముడిపడి ఉన్నాయంటూ ఈ ప్రాంతంలో ఉన్న అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ వంటి సదుపాయాల వల్లే వేలాదిమంది పేద భక్తులు, సామాన్య ప్రజలు కనీస సౌకర్యాలతో దర్శనానికి వస్తున్నారని తెలిపారు. ఈ స్థలంపై అకస్మాత్తుగా నోటీసులు జారీ చేసి నిర్మాణాల తొలగింపు లేదా చట్టపరమైన చర్యల హెచ్చరికలు ఇవ్వడం ధార్మిక ఆచారాలకు, భక్తుల సౌకర్యాలకు భంగం కలిగించే చర్యగా బీజేపీ అభిప్రాయపడుతోందన్నారు. ఈ వివాదంలో చట్టపరమైన అంశాలతోపాటు భక్తుల విశ్వాసాలు, ధార్మిక సంప్రదాయాలు, పేద భక్తుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రెవెన్యూ, అసిస్టెంట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఎండోమెంట్, అటవీ శాఖలు కలిసి కూర్చొని భూముల హద్దులు, పరిమితులను స్పష్టంగా నోటిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎండోమెంట్ శాఖ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ అటవీ శాఖ నోటీసులు జారీ చేయడం అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తోందన్నారు. కొండగట్టు వద్ద 6 ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా రాంసాగర్ గ్రామంలో ఉన్న దేవాదాయ భూముల నుంచి 8 ఎకరాలు ఇవ్వడానికి ఎండోమెంట్ శాఖ ముందుకొచ్చినా అటవీ శాఖ కొండగట్టు ఆలయం పరిధిలోనే వివాదాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ వివాదానికి వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





