విద్యాలయాలలో విషాహారం.. బాలల జీవించే హక్కు ఉల్లంఘనే!

పౌష్టికాహారం అందించడం  ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యత

రాష్ట్రంలో ఈ మధ్యవివిధ  పాఠశాలల్లో గురుకులాలలో విషాహారం వలన విద్యార్థుల  మరణాలు..  అనారోగ్యం పాలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఇది ఏ ప్రభుత్వ  హాయం లో ఎక్కువ జరుగుతుంది అనే చర్చ కన్నా ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే ప్రశ్న వేయడం ముఖ్యం.  ఎందుకు విద్యాలయాల్లో  భోజనం పెడుతున్నాం.   విద్య నేర్పాలి కదా భోజనం ఎందుకు పెడుతున్నాం.  అసలు ఈ పిల్లల నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలి.  ప్రభుత్వ బడులలో గురుకులాలలో  చదువుకుంటున్నఅత్యధిక శాతం మంది పిల్లలు పేదరికం, లింగ వివక్షత, కుల వివక్షతలను ఎదుర్కొంటూ  ప్రభుత్వ సేవలకు దూరంగా ఉంటున్న  అనేక తిరోగమన  సామాజిక  కట్టుబాట్లతో  పెరుగుతున్న  పిల్లలు. ఈ పిల్లలంతా పోషకాహారం , భద్రత  అభివృద్ధి అవకాశాల నుండి వంచనకు గురి అవుతున్న పిల్లలు. ఈ పిల్లల కుటుంబాలలో ప్రతినిత్యం ఆకలి  అనారోగ్యం, పోషించే కుటుంబ సభ్యుల ఆకస్మిక మరణాలు ఒంటరి మహిళల పిల్లలు, కుటుంబ హింస , తల్లి దండ్రులు లేక నాయనమ్మల తాతల  దగ్గర చూట్టాల దగ్గర పెరుగుతున్న పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారు. తెలంగాణలో సుమారు 40 శాతం జనాభా పట్టణ ప్రాంత  నివసిస్తున్నారు. అత్యధిక శాతం ప్రజలు పేదలే. వీరంతా బస్తీలలో  ఇరుకు ఇరుకు ఇళ్ళళ్లలో  నివసిస్తున్నారు. స్లమ్‌లలో పెరుగుతున్న పిల్లలు అనుభవించే బాల్యం సాధారణంగా ఊహించలేనిదిగా ఉంటుంది.

తల్లిదండ్రులు అందరు అసంఘటిత రంగాలలో పని చేస్తున్న కార్మికులు. పొద్దున్నే పనికి వెళ్ళే తల్లిదండ్రులకు  వంటలు చేసే సమయం ఉండదు. బడిలో పెట్టే  మధ్యాహ్న  భోజనం కోసం ఎదురుచూసే పిల్లలు చాలా మందే ఉంటారు. వారి చూపులు చదువుపై కాకుండా మధ్యాహ్నం ఎప్పుడైతుందా అని చూపులు  వారివి  ఆకలి చూపులే. ఈ పిల్లలంతా అణగారిన  వర్గాలకు  చెందిన పిల్లలు, షెడ్యూల్డ్‌ కాస్ట్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌, అమ్మాయిలు, మొదలైన వారు ప్రత్యేకంగా సమగ్ర అభివృద్ధి అవకాశాల నుండి వంచించబడుతున్న వారు. ఇటువంటి బాలలకు పౌష్టికాహారం అందించడం లో నాణ్యమైన విద్యను అందించడం  ప్రత్యేక  శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉండగా వారికి కేటాయించే బియ్యం నాణ్యత ఆహార సరకులకు ఇచ్చే నిధులు  చూస్తే మన బాలలకు మనమిచ్చే మర్యాద ఏమిటో అర్ధం అవుతుంది. భారతదేశ పిల్లల పరిస్థితిని ‘‘శాశ్వత మానవతా అత్యవసరం’’ గా అభివర్ణించడం సముచితం.  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల  ప్రకారం, భారతదేశ పిల్లల జనాభాలో ఎక్కువ శాతం  మంది పోషకాహార లోపంతో ఉన్నారు. ఆకలి, పోషక లోపాలు పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, వారిలో నేర్పరితనాన్ని తగ్గిస్తాయి, వారి జీవితాలను ఇంకా చాలా విధాలుగా కుంటు పరుస్తాయి. ఇంత అధిక పోషకలోపం చాలా తక్కువ దేశాలలోనే ఉంది. బాలల హక్కుల పరిరక్షణ ప్రభుత్వాల చట్ట బద్ద  బాధ్యత. ఆరోగ్యవంతమైన మధ్యాహ్న భోజనం పిల్లల్ని ఆకలి నుంచి కాపాడి, అదనపు పోషకాలను అందించడానికి తోడ్పడుతుంది. ఆహారపు హక్కును హామీ ఇవ్వడానికి మధ్యాహ్న భోజనం సరిపోదు కానీ, ఈ దిశలో అదొక ముఖ్యమైన అడుగు. అలాగే, వండిన మధ్యాహ్నం భోజనం, వారి నేర్పరితనాన్ని పెంపొందించడం ద్వారా విద్యాహక్కులో పాత్ర వహిస్తుంది.

ఆకలితో తరగతి గదులు:  చాలా మంది పిల్లలు ఖాళీ కడుపుతో బడికి హాజరవుతారు. బడికి బయలుదేరే ముందు భోజనం చేసిన పిల్లలకు కూడా  మధ్యాహ్నానికి ఆకలివేస్తుంది, ఆపై వారు విద్యార్జనపై దృష్టి నిలుపలేరు. ప్రత్యేకించి మధ్యాహ్న భోజనం కట్టి ఇవ్వలేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, బడికి చాలా దూరంలో నివాసం ఉండే పిల్లలకు ఈ సమస్య ఎక్కువ. మధ్యాహ్న భోజనం తరగతి గదిలో ఆకలిని నివారించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి దోహదం చేస్తుంది. విధాన నిర్ణయాలు చేసే వారికి గాని ఆ నిర్ణయాలను అమలు పరిచే ప్రభత్వ యంత్రంగానికి గాని  ఈ పిల్లల నేపధ్యం ఎ  మాత్రం తెలియదని  తెలుసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయరని ఈ మధ్య పాఠశాలలలో విషాహారంతో అనారోగ్యం పాలవుతున్న పిల్లల పట్ల వారు చేస్తున్న బాద్యతారాహిత్య  ప్రకటనల ద్వారా తెలుస్తుంది. రాజకీయ లబ్ది కోసం కొన్ని ప్రకటలైతే బాధ్యత ను గత పాలకుల మీద వేస్తూ  మరికొన్ని ప్రకటనలు.  ఈ ప్రకటన వలన ఇబ్బందులు పడుతున్న పిల్లలకు ఒరిగేదేమీ లేదు.  పిల్లలకు పౌష్టికాహారం అందించడం లేదంటే రాజ్యాంగం లో నిర్దేశించిన జీవించే హక్కు ఉల్లంఘన కు గురి అవుతుందని అర్ధం.  పిల్లల హక్కుల రక్షణలో  ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడు పౌరులు పౌర  సంఘాలు న్యాయ స్థానాలను ఆశ్రయించి బాలలకు న్యాయం  పొందే  అవకాశం ఉంది.  పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే పౌర సంస్థ సుప్రీం కోర్టు లో ప్రజా వ్మాయం వేసింది.

చారిత్రాత్మక సుప్రీం కోర్టు తీర్పు:  పోషకాహార లోపం ఆకలితో పౌరులు చనిపోవడం బాలలకు పౌష్టిక విలువల ఆహారం అందక పోవడం అంటే రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్‌ 21 ప్రకారం  జీవేంచే హక్కు ను హరించి వేసినట్లే. ఇదే విషయాన్ని పురసకిరిం చుకొని 2001 ఏప్రిల్‌లో పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌, రాజస్థాన్‌ సుప్రీం కోర్టుకు సమర్పించిన రిట్‌ పిటిషన్‌తో ప్రారంభమైంది. ఈ పిటిషన్‌లో దేశంలోని భారీ ఆహార నిల్వలను ఆకలితో బాధపడుతున్న మరియు అల్పాహారంతో ఉన్న ప్రజలను రక్షించడానికి ఆలస్యం లేకుండా ఉపయోగించాలి అని డిమాండ్‌ చేసింది. ఈ పిటిషన్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ గా కొనసాగింది. సుప్రీం కోర్టు వాదనలు నిరంతరం జరిగాయి మరియు కేసు నడుస్తున్న సమయం లోనే   ముఖ్యమైన ‘‘మధ్యంతర  ఆదేశాలు’’ జారీ అయ్యాయి. 2001 నవంబర్‌ 28న, సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహకార ప్రాథమిక పాఠశాలల్లో ఆరు నెలల లోపు వండిన మధ్యాహ్న భోజనాలు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ ఆదేశం తరువాత, దేశ వ్యాప్తంగా  పౌర సమాజం జాతీయ స్థాయిలో  ‘రైట్‌ టు  ఫుడ్‌’ అనే సంస్థ ను   ఏర్పాటు చేసుకుని   ఉద్యమం నిర్వహించబడిరది. మధ్యాహ్న భోజన పథకం ఎవరి దయా దక్ష్యాల మీద ఆధారపడి వచ్చింది కాదని బాలల హక్కు గా వచ్చిందని  అందరం గ్రహించాలి. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తే బాలల పట్ల జీవించే హక్కును కాపాడే దిశగా అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను పరిశీలించాలి.

మధ్యాహ్న భోజనం పై సుప్రీం కోర్టు ఆదేశాలు: కనీస హక్కు (బేసిక్‌ ఎనైటిల్మెంట్‌) :  ప్రభుత్వ  పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు  300 కేలరీలు, 8-12 గ్రాములు ప్రోటీన్తో కూడిన వండిన మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల పనిచేసే ప్రతిరోజూ సరఫరా చేయాలి. ఏడాదిలో కనీసం 200 రోజుల పాటు ఈ సదుపాయం అందాలి’’. (నవంబర్‌ 28, 2001 నాటి ఉత్తర్వులు)
-ఆహార ధాన్యాలను భోజనంగా వండటానికి అయ్యే ఖర్చును భరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలి (ఏప్రిల్‌ 20, 2006 నాటి ఉత్తర్వు),
-వంటశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి (ఏప్రిల్‌ 20, 2004 నాటి ఉత్తర్వు) దళిత వంట పనివారికి ప్రాధాన్యత: ‘‘వంటవారు, సహాయకుల నియామకంలో దళితులు, షెడ్యూల్డ్‌ తెగలవారికి ప్రాధాన్యత ఇవ్వాలి’’ (ఏప్రిల్‌ 20 2004 నాటి ఉత్తర్వు).
-మెరుగైన సాధనాలు (ఇన్‌ ప్రాస్ట్రక్చర్‌), మంచి వసతులు (రక్షిత మంచినీరు వంటివి), మంచి పర్యవేక్షణ (తరచు తనిఖీ చేయడం, వగైరా), ఇతర భద్రతా ప్రమాణాలతో పాటు పిల్లలకు మంచి పోషకాలతో కూడిన భోజనం అందించడం కోసం భోజనంలోని సరకుల నాణ్యత మెరుగుదల కోసం ప్రయత్నాలు చేయాలి (ఏప్రిల్‌ 20, 2004 నాటి ఉత్తర్వు),

-కరవు పీడిత ప్రాంతాలలో మధ్యాహ్న భోజనాన్ని వేసవి సెలవుల్లో కూడా సరఫరా చేయాలి (ఏప్రిల్‌ 20, 2004 నాటి ఉత్తర్వు)
-ఈ పథకం కోసం, నాణ్యమైన ధాన్యం (ఫెయిర్‌ యావరేజ్‌ క్వాలిటీ)ను సకాలంలో అందించే ఏర్పాటు చేయాలని నాణ్యతను ఉమ్మడిగా పరిశీలించాలని   ఆదేశించింది.   ఉమ్మడి తనిఖీ సందర్భంలో ఆహార ధాన్యాలు మేలురకానికి చెందినవి కాదని గుర్తిస్తే, వాటిని అప్పగించే ముందే భారతః ఆహార సంస్థ వాటిని మార్చాలని ఆదేశించింది. (మే 28 2001  మధ్యాహ్న భోజన ఏర్పాట్లకు భద్రత, శుభ్రతకు సుప్రీం కోర్టు ఆదేశాలతో 2015 లో  కేంద్ర  విద్యా శాఖ విడుదల చేసిన మార్గ దర్శకాలు:   ఆహారాన్ని తరగతి గదికి తగినంత దూరంలో నిర్మితమైన వంటశాలలో తయారుచేయాలి. వంటశాల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వీలైనంత వరకు వంట చేయడం కోసం ఎత్తయిన అరుగు ఉండాలి, కాంతి సమృద్ధిగా వుండాలి, గాలిపారుదలకు పరికరాలు, డ్రైనేజీ, చెత్త తొలగింపు ఏర్పాటు ఉండాలి. భోజనానికి అవసరమైన దినుసులన్నిటినీ తగిన పాత్రలలో నిల్వచేసి, తేమ, కీటకాల నుంచి భద్రంగా ఉంచాలి. ఇంధనాన్ని కూడా వంటశాలకు దూరంగా, భద్రంగా, అగ్నిప్రమాదాలకు ఆస్కారం లేకుండా నిల్వచేయాలి. సాధ్యమైనంత వరకు, పొగరాని గొట్టాలను ఉపయోగించాలి. సాధారణ పొయ్యిల నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తులకు, కళ్ళకు ప్రమాదకరం. వంట దినుసులను పట్టుకునే వారు, వంటలోనూ, వడ్డించడంలోనూ పాత్రవహించేవారు శుభ్రత అలవాట్లను పాటించాలి. వంటకు ఉపయోగించే అన్ని దినుసులు (అంటే, బియ్యం, పప్పులు, కూరలు, వంట నూనె, పోపు గింజలు) కల్తీ కాకుండా, పురుగు పట్టకుండా వుండాలి, తగిన విధంగా శుభ్రం చేసి, కడిగిన తర్వాత ఉపయోగించాలి.

ఆహారం వండి, తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానిని పూర్తిగా మూతకప్పి వుంచాలి, కీటకాల నుంచి పూర్తిగా రక్షించేలా పెట్టాలి. వంటచేసేవారు, సహాయకులు ఎలాంటి అంటు వ్యాధులతో బాధపడటం లేదని ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవాలి. ఆహారం ద్వారా క్రిములు ప్రసరించకుండా జాగ్రతవహించాలి. వారికి క్రమ పద్ధతిలో వైద్యపరీక్షలు జరపాలి. అన్ని వంటపాత్రలు, వడ్డించే పాత్రలను రోజూ ఉపయోగించిన వెంటనే శుభ్రంగా కడిగి, అరబెట్టాలి. వ్యర్ధపదార్ధాలను సరిగా పడవేయాలి, బహిరంగ ప్రదేశాలలో పడవేయరాదు. క్లుప్తంగా, మధ్యాహ్న భోజనానికి మంచి వసతిసదుపాయాలు, మానవ వనరుల సమర్దవంత వినియోగం ఉండాలి. ఇంత ప్రతిష్టాత్మక పథకాన్ని రాష్ట్ర  ప్రభుత్వాలు శ్రద్ద పెట్టాల్సినంత శ్రద్ద  పెట్టడం లేదని గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో జరుగుతున్న విషాహార సంఘటలను  బట్టి తెలుస్తుంది. ఎక్కడైనా సంఘటన  జరిగినప్పుడు స్థానిక అధికారుల మీద చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం చూస్తూనే ఉన్నాము. పాఠశాల స్థాయిలో పర్యవేక్షణలు చేసి వంట వండే మహిళలను  గురుకులాలో పనిచేస్తున్న సిబ్బందిని, ఉపాధ్యాయులను దోషులుగా నిలబట్టడం కంటే ముందు సచివాలయం లో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. రాష్ట్రం లో విద్యార్థులకు  నాణ్యమైన ఆహారం అందించాలంటే పరస్పర రాజకీయ ఆరోపణలు కాకుండా  ప్రస్తుతం వ్యవస్థలో  ఉన్న లోపాలను రాష్ట్ర స్థాయిలో  సరిచేయవలసి ఉంది.
రాష్ట్ర స్థాయిలో తీసుకోవలసిన తక్షణ నిర్ణయాలు:  మధ్యాన్న భోజనం వంట చేసే వాళ్ళు పేద వర్గాలకు చెందిన మహిళా సంఘ  సబ్యులు. వీరికి ఎప్పుడు కూడా నిధులు సరి అయిన సమయానికి విడుదల రావు. ఉన్న తులమో మాసమో  తాకట్టు పెట్టి వడ్డీలకు  అప్పులు చేసి వంటలు చేస్తున్నారు.

గురుకులాలకు సరకులు సప్లై చేసే వారి పరిస్థితి కూడా పెద్ద తేడా లేదు.బిల్లులు రాలేదని అప్పులు చేసి సమకూరుస్తున్నామని  నాణ్యత మీద అడగవద్దని గురుకుల బాధ్యుల మీద వత్తిడి పెడుతుంటారు.  ఖర్చు చేసిన   రెండు మూడు నెలలకు కానీ బిల్లులు రావు. విషాహారం గురుంచి మీడియా ప్రతిపక్షాలు పౌర సమాజం ప్రభుత్వ ఉతర్వులు పర్యవేక్షణలు జరుగుతున్న సమయం లో కూడా ఇంకా రెండు మూడు నెలల బిల్లులు రాలేదంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  లెక్కలన్నీ సచివాలయం ఆర్ధిక శాఖ దగ్గర విద్యా శాఖ దగ్గర లభిస్తాయి. పెండిరగ్‌ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించి మూడు నెలల అడ్వాన్సు గా నిధులను విడుదల చేయాలి. వంట చేసే శ్రామికుల వేతనాలు కూడా సకాలం లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రతి నెల విడుదల చేయాలి. ఆలస్యంగా జీతాలు రావడం వారికి పని మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. వంటకు ప్రధాన మైన పదార్ధాలలో బియ్యం చాలా ముఖ్యం. ప్రతి పాఠశాలలో విషాహారానికి ప్రధాన కారణం నాసిరకమైన చాల రోజులు నిల్వ ఉంచిన  పురుగులు రాళ్ళ  తో కూడిన బియ్యం సరఫరా చేయడమే అని పలు నివేదికలు చెపుతున్నాయి. కాబట్టి వెంటనే నాణ్యమైన బియ్యాన్నిఅందించాలి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భోజన వ్యయాన్ని పెంచాలి. ఎప్పుడో నిర్ణయించిన రేట్ల వలన సరకులు నాసిరకం వాడే పరిస్తితి ఏర్పడిరదని పలు పర్యవేక్షణాల ద్వారా అర్ధం అవుతుంది. ఉదహాహారణ కు గుడ్డు ధర అయిదు రూపాయలు గా నిర్దేశించారు. మార్కెట్లోధర అధికంగా ఉంది.  అలాగే శుద్దమైన నీటి సదుపాయాలు మరియు ఎప్పుడో సరఫరా చేసిన వంట పాత్రలను తక్షణమే మార్చి కొత్త పత్రాలను అందించాలి. పాఠశాల పరిధిలో మధ్యాన్న భోజనం పరిస్తితి ఆందోళన కరంగా ఉంటే పట్టణ ప్రత్యలలో మునిసిపాలతీలలో కెదర వంట గదుల ద్వారా సరఫరా అయ్యే ఆహారాన్ని విద్యార్థులు తినడం లేదని క్షేత్ర స్తాయి పరిశీలనాల ద్వారా తెలుస్తుంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శాల ప్రకారం భోజనం 65 డిగ్రీల ఉష్ణోగ్రత్తలోనే ఉంచాలి.

 

వంట కేంద్రాలలో ఎప్పుడో మద్య రాత్రి వండి పాఠశాలలకు సరఫరా చేసే సమయానికి చల్లగా రుచికరంగా లేదని పిల్లలు చెపుతున్నారు. కేంద్ర వంట గాడి ద్వారా కాకుండా పాఠశాలలో నే వేడి భోజన సదుపాయం కల్పించాలి. ఇది చట్ట స్పూర్తికి సుప్రీం  కోర్టు  తీర్పు కు అనుగుణంగా ఉంటుంది. చివరగా ..  మధ్యాన్న భోజనానికి సంభందించిన  సుప్రీమ్‌  కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఉత్తర్వులను దాదాపు అన్నీ అంశాలు 2013 లో  కేంద్రం చేసిన  ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ 2013  పరిధి లోకి తెచ్చారు. యుపిఎ ప్రభుత్వం  సోనియా గాంధీ నేతృత్వం లో వచ్చిన ప్రముఖ చట్టాలలో జాతీయ ఆహార భద్రతా చట్టం.  ఇంత ముఖ్యమైన చట్టాన్ని  విద్య శాఖ మరియు  సంక్షేమ శాఖ మంత్రి  కూడా అయిన ముఖ్య మంత్రి గారు పై పై మెరుగులు కాకుండా కావాల్సిన  నిధులను కేటాయించాలి. తెలంగాణ విద్యా కమిషన్‌ అన్నీ జిల్లాలలో  క్షేత్ర  స్థాయి పర్యటనలు చేసి అందించే నివేదిక సిఫారసులను చిత్తశుద్ది తో అమలు పరచాలి. లక్షాలదీ మంది విద్యార్థుల ప్రాధమిక హక్కులైన  పౌష్టికాహారాన్ని  నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ చట్టబద్ద బాధ్యత గా గుర్తిస్తారని ఆశిద్దాం.
-ఆర్‌.వెంకట్‌ రెడ్డి
జాతీయ కన్వీనర్‌, ఎం.వి.ఫౌండేషన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *