పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి

పీఎం ఆర్థిక సలహామండలి చైర్మన్‌తో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే అంశంపై వారు చర్చించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతోపాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని, దానికి అనుసంధానంగా రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న రుణాలపై అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి చెల్లింపులు కష్టమవుతోందని, వడ్డీలు చెల్లించేందుకే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *