యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట (పెద్ద కందుకూరు) గ్రామానికి చెందిన కల్లెపల్లి ఉపేంద్ర (43) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురు రోగుల జీవితాల్లో వెలుగు నింపింది. ఈనెల 16న భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా జరిగిన కారు ప్రమాదంలో ఉపేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స అందించినప్పటికీ, 25న సాయంత్రం ఆమెను బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు.అయితే తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, కల్లెపల్లి ఐలయ్య ధైర్యం చేసి, ఐదుగురు ప్రాణాలను రక్షించడానికి తన భార్య అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కల్లెపల్లి ఉపేంద్ర రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. ఈసందర్భంగా కల్లెపల్లి ఐలయ్యకు, జీవందన్ తెలంగాణ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఈ దానంతో తెలంగాణ జీవందన్ కార్యక్రమం ఈ సంవత్సరంలో 180వ బ్రెయిన్ డెడ్ అవయవ దానాన్ని నమోదు చేసి ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది.
భార్య అవయవ దానంతో ఐదుగురికి కొత్త జీవితం

పుట్టెడు దుఃఖంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం..
యాదగిరి గుట్ట వాసి కల్లెపల్లి ఐలయ్య మానవీయత




