గోల్కొండ జగదాంబకు ప్రభుత్వం తొలి బోనం

పాల్గొన్న స్పీకర్‌, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, మేయర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్‌ హౌజ్‌ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీలు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతోపాటు తొలి బోనం సమర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ దాసరి హరిచందన, సిపి సివి ఆనంద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు

హైదరాబాద్‌ సాంప్రదాయాలు ఆచారాలు ప్రపంచస్థాయిలో గుర్తించదగిన ఆషాఢ మాస బోనాలలో తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున సమర్పించామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సీఎం రేంవంత్‌ రెడ్డి నాయకత్వంలో కేబినెట్‌ మొత్తం ప్రభుత్వం తరపున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మంచి ఆతిథ్యం ఇచ్చేలా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు, ఆలయాల కమిటీలకు సూచించారు. బోనాల సందర్భంగా మూడు వేల దేవాలయాలకు రూ.20 కోట్లు ప్రభుత్వం కేటాయించామన్నారు. నెల రోజులపాటు వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ రంగం కార్యక్రమాలు ఉంటాయని, ఆ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో తులతూగుతూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *