ప్రగతినగర్ ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం

– 22 షాపుల్లో ఫర్నిచర్, ముడిసరకు దగ్ధం
– రూ.కోట్లలో నష్టం.. ఆవేదనలో వ్యాపారులు
– షార్టు సర్క్యూటే కారణమని అనుమానం

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 4 : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఎందరో వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కమాన్ వద్ద మంగళవారం రాత్రి షార్టు సర్క్యూట్ కారణంగా వరుసగా 22 ఫర్నిచర్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి ఫర్నిచర్, ముడిసరకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేదంటే మరో 25 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యేవి. రూ.కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. విద్యుత్ లైన్ల కనెక్షన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరఐలు మల్లేశ్వరరావు, భానుచందర్, జిపిఓలు అనురాధ, పవిత్ర దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు పక్కన వరుసగా సుమారు 50 షాపులు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్‌తో ముందుగా ఒక షాపులో మంటలు చెలరేగగా అందులో సిలిండర్ పేలింది. దీంతో దుకాణాల యజమానులు, నిర్వాహకులు ఏం జరిగిందని ఆలోచించేలోపు వరుసగా 22 దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కసారి భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలార్పినప్పటికీ 22 షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

నష్టం అంచనా వేసి నివేదిక పంపిస్తాం : ఆర్ఐ మల్లేశ్వరరావు

ప్రగతినగర్ కమాన్ పక్కన షార్ట్ సర్క్యూట్‌తో 22 దుకాణాలు దగ్ధమయ్యాయి. నష్టపోయిన దుకాణ యజమానుల వద్ద నుండి నష్టం అంచనా నమోదు చేస్తున్నాం. పంచనామా రిపోర్టును ఉన్నతాధికారులకు అందిస్తాం.

సుమారు రూ.9 కోట్ల ఆస్తి నష్టం : ఆర్ఐ భానుచందర్

ఒక్కొక్క షాపులో సుమారు రూ.30 నుండి రూ.40 లక్షల ఫర్నిచర్, ముడిసరకు ఉన్నట్లు బాధితులు తెలిపారు. మొత్తంగా 22 షాపుల్లో రూ.8 నుండి రూ.9 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

ఈ ప్రమాదం మొదటిసారి : బాధితుడు కోటేశ్వరరావు

మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదం కళ్ళల్లో మెదులుతూ ఉంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.. చూసేలోపే మా జీవితాంతం సంపాదించినదంతా బూడిదైంది. తొమ్మిదిపది సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాం. నా జీవితంలో మర్చిపోలేని ఘటన.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *