– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి బండారి లక్ష్మారెడ్డి ఉదారత
– కేటీఆర్ చేతుల మీదుగా చెక్కుల అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు వారి విద్యా సంవత్సరం ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు చెక్కులను అందజేస్తూ, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలోని పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న లక్ష్మారెడ్డి గారి సేవా దృక్పథం అందరికీ ఆదర్శనీయమని కేటీఆర్ కొనియాడారు. బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ‘బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజుల భారం కలగకుండా చూస్తామని, వారు భవిష్యత్తులో గొప్ప వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వైద్య విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులు, తమ చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి, తమకు శుభాకంక్షలు తెలిపిన కేటీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





