Discussions: చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం

– మా ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుంది
– హైదరాబాద్‌ను ఫిల్మ్‌ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం
– అందుకు అందరి సహకారం అవసరం
– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నుండి సినిమా షూటింగ్స్‌ పునఃప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాతలు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధుల(ఫిల్మ్‌ ఫెడరేషన్‌)తో సచివాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయినందునపెండిరగ్‌ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వివిధ సంఘాల సభ్యులను కోరారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫిలిం హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. సినిమా, వినోద రంగంలో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండటంతో అవి ఉత్తమ సినిమా షూటింగ్‌ లొకేషన్లుగా ఉపయోగించవచ్చని చెప్పారు. ఇది స్థానిక ప్రజలకు ఆదాయాన్ని కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుందన్నారు. సినిమా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, అదే సమయంలో సిని పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచన చేస్తున్నాని మంత్రి తెలిపారు. అయితే సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేద సినిమా కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ అన్ని పక్షాల మధ్య ఐక్యత అవసరమన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫిలిం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ చర్యలను బలపరిచేలా అందరూ కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా, పలువురు నిర్మాతలు, సినిమా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *