– సంస్కరణలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు
– కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌లకు చోటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో చాలా అవతకవకలతో పాటు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకొంటున్న నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. కాలేజీల బంద్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు 15 మందితో ఈ కమిటీని నియమించింది. ఇక కాలేజీల నుంచి ఈ కమిటీలో ముగ్గురికి చోటు కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఈ కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌లకు చోటు కల్పించినట్లు స్పష్టం చేసింది. ఈ కమిటీ.. పీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. అలాగే ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక అందజేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓలో స్పష్టంగా సూచించింది. అలాగే విద్యా సంస్థలు స్పష్టం చేసిన సూచనలపై సైతం అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం, ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరుగుతోంది. సమయానికి ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో.. కాలేజీ యాజమాన్యం తమ కళాశాలల బంద్‌కు పిలుపునిస్తుంది. ఆ క్రమంలో కాలేజీ యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీంతో వాయిదాల రూపంలో నగదు చెల్లిస్తామంటూ కాలేజీల యాజమాన్యానికి ప్రభుత్వం తెలుపుతోంది. అందుకు ఆ కాలేజీల యాజమాన్యం సానుకూలంగా స్పందించకుండా ఆందోళనలకు దిగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





