విత్తనోత్పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. వానాకాలం 2025లో 66.80 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 50 లక్షల ఎకరాలలో పత్తి, 9 లక్షల ఎకరాలలో సోయాచిక్కుడు సాగు అవుతుందని అంచనా వేశామని తెలిపారు. దానికి తగ్గట్లుగా 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల మొక్కజొన్న, 89 లక్షల ప్రత్తి ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయాచిక్కుడు విత్తనాలు అవసరమవుతాయని, వరిలో సన్న బియ్యం సాగు ఈసారి ఇంకా పెరిగే అవకాశమున్నందున సన్నరకాల విత్తనాలను అధికమొత్తంలో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. పత్తికి సంబంధించి 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని, జిల్లాలు, ప్రాంతాల వారీగా డిమాండ్ ఉన్న పత్తి రకాలను అవసరం కంటే అధికమొత్తంలో తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచడానికి కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు.
పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి ఈ వానాకాలం 2025 పంటకాలం కంటే ముందుగా ఏప్రిల్ మాసంలోనే విత్తనాలు తెప్పించి అందుబాటులో ఉంచేలా ఇప్పటికే టిజి సీడ్స్ వారికి 1.94 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. వీటి సరఫరాలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా డిమాండ్ ఉన్న రకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వరిపంట సాగుచేస్తున్న రైతుల నుంచి బెరుకులు ఎక్కువగా రావడం, తొందరగా కంకి వేయడం లాంటి ఫిర్యాదులు వొస్తున్నాయని, వీటిని సరిదిద్ధి, నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోయిన సందర్భాలు ప్రభుత్వం దృష్టికి వొస్తున్నాయని, విత్తన కంపెనీలకు రైతులకు మధ్య వారధిగా ఉన్న ఆర్గనైజర్లలో కొంతమంది రైతులకు దక్కాల్సిన ధరను కాని, చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కానీ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సత్వరమే సీడ్ మెన్ అసోసియేషన్, కంపెనీ ప్రతినిధులు కూర్చొని విత్తనోత్పత్తి ఒప్పందాలు కంపెనీలకు, రైతులకు మధ్య కుదిరేలా, పండించిన విత్తనానికి చెల్లించే మొత్తం కానీ, సరిగ్గా పంటరాని సందర్భంలో చెల్లించే పరిహారం కానీ రైతులకే చెల్లించేలా చూడాలని అన్నారు. ఇక ముందు ఎక్కడైనా ఇటువంటి ఫిర్యాదులు వొస్తే ప్రభుత్వం ఆయా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
అదేవిధంగా వ్యవసాయాధికారులు వారివారి పరిధిలో ఉన్న విత్తన కంపెనీలను తరుచూ పర్యవేక్షించి, రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చూడాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు విత్తన ఎంపికలో మరియు కొనుగోళ్లలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కార్యక్రమాలు రైతు వేదికలలో చేపట్టాల్సిందిగా, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటు గ్రామాలలో లేబుల్ లేకుండా విత్తనాలు అమ్మే వారిని నియంత్రించే విధంగా చూడాలని కోరారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో కూరగాయల విత్తనాల లభ్యతపై దిగుబడులపై కూడా కంపెనీ ప్రతినిధులతో ఆరా తీసి, కూరగాయల విస్తీర్ణాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, టి.జి సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి సీడ్స్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సీడ్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.





