కాళేశ్వ‌రాన్ని ఎండ‌బెట్టి రైతుల‌కు ద్రోహం

-కాళేశ్వ‌రం కూలితే హైద‌రాబాద్‌కు నీళ్లెట్ల తెస్తారు?
– వంద‌శాతం రుణ‌మాఫీ జ‌రిగిందంటే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా
– జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ గడువెందుకు పెంచాల్సి వ‌చ్చింది?
– ఇచ్చింది చారానా…బిల్డ‌ప్ బారానా
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. సెటైర్లు

కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్న‌దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు.  గురువారం నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, మేడిగడ్డ పిల్లర్ కు చిన్న పర్రె పడితే దాన్ని దాచి పెట్టి మొత్తం ప్రాజెక్టే కూలిందని కాంగ్రెస్, ఎన్.డి.ఎస్. ఏ రిపోర్ట్ తో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ ని చూస్తుంటే ఈ అనుమానం ఇంకా బలపడుతుం దన్నారు. ఒక్క మనిషే నలుగురు లెక్క నటించే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడన్న కేటీఆర్, ఓవైపు కాళేశ్వరం కూలిందని ప్ర‌చారం చేస్తూనే ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొస్తానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. నిజంగానే కాళేశ్వరం కూలిపోతే కొండ పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయ‌ని ప్ర‌శ్నించారు.  ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం దాని మీద ఇష్టం వ‌చ్చిన రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు.

టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా అపారమైన గౌరవాన్ని పొందిన ఒక నాయ‌కుడు కాంగ్రెస్‌లో చేరితే ఇప్ప‌డు క‌నీసం కూర్చోమ‌న్న దిక్కుకూడా లేద‌ని అన్నారు. మనం చేసే పనులతో, మన క్యారెక్టర్ తోనే మనకు గుర్తింపు వస్తుంది తప్ప పదవులతో అధికారంతో రాద‌న్నారు.  పోయినోళ్ళు పోనీ ఉన్న వాళ్ళతోనే పార్టీని బలోపేతం చేసుకుందాం. నిర్మల్, ముధోల్, ఖానాపూర్లో తిరిగి గులాబి జెండా రెపరెపలాడించాలి. ఇక్క‌డ మ‌ళ్లీ పార్టీని ప‌టిష్టం చేసుకుందామ‌న్నారు. త్వ‌ర‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి ప‌రిశీల‌కుల‌ను పంపుతామ‌ని చెప్పారు. ప్ర‌తి ఊరు ఒక్కో నియోజకవర్గం న్ని క్షుణ్ణంగా పరిశీలించి గెలిచాక పార్టీ నమ్ముకుని ఉండే వాళ్లకు టికెట్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పాలన కంటే కెసిఆర్ పాలన బాగుంది అని చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వ పాలన ను ఇష్టపడడం లేదు. రైతులయితే ప్రతి ఊర్లో బాధపడుతున్నారు. వంద‌శాతం రుణమాఫీ ఎక్కడ అయిందో చూపెట్టాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదన్నారు.

రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లి లో గాని, సొంత నియోజకవర్గం కొడంగల్ లో గాని ఆయనకు పిల్లనిచ్చిన నియోజకవర్గం కల్వకుర్తిలో గాని ఎక్కడైనా సరే ఒక్క ఊర్లో వంద‌శాతం రుణమాఫీ అయిందంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఛాలెంజ్ చేస్తే ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి జవాబు లేదన్నారు. రుణ మాఫీకి రూ. 49,500 కోట్లు కావాలని అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు భట్టి విక్రమార్క చెప్పిండు. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. క్యాబినెట్ సమావేశంలో రూ. 31 వేల కోట్ల రుణమాఫీ అన్నరు. అసెంబ్లీలో రూ. 26 వేల కోట్ల రుణమాఫీ అన్నారు. చివ‌ర‌కు రూ. 11000 కోట్లు ఇచ్చాము రుణమాఫీ చేయండి అని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క చెప్పాడన్నారు.  ఆవిధంగా రూ. 49500 కోట్ల రుణమాఫీ చివరకు 11వేల కోట్లకు వచ్చింద‌ని ఎద్దేవా చేశారు. అది కూడా పూర్తిగా ఇవ్వ‌లేదు. ఇచ్చింది చారానా వంతు అయితే బిల్డప్ మాత్రం బారానా వంతు చేసుకున్నార‌ని విమ‌ర్శించారు. ఊర్లో సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేడు, జడ్పిటిసి లేడు ఎమ్మెల్యే లేడు. కాంగ్రెస్ నేతలందరూ సెక్రటేరియట్ చుట్టూ పైరవీలు కోసం తిరుగుతున్నారు.ఈ ప్రభుత్వం 20% 30% కమిషన్ల చుట్టూనే తిరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని మంత్రి సురేఖ చెప్పారని గుర్తుచేశారు.

మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఒకతను మా మంత్రులంతా 30% కమిషన్ తీసుకుంటున్నారని బహిరంగంగానే చెబుతున్నార‌న్నారు. 20%, 30% కమిషన్ మీకు ఇస్తే ఇక మాకు మిగిలేదేంట‌ని  కాంట్రాక్ట‌రు్ల ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు ధ‌ర్నాచేశార‌న్నారు. చరిత్రలో ఇప్పుడు దాకా చూడని విధంగా వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభ తర్వాత, అక్కడ కెసిఆర్ ని చూసి ప్రత్యర్థులకు గజ్జుమంది. అందుకే తమ అవినీతి బాగోతం, కమిషన్ల దందాల నుంచి ప్రజల దృష్టినీ మరల్చడానికి కాళేశ్వరం విషయంలో కెసిఆర్ కు నోటీసులు ఇచ్చార‌న్నారు.  సంవత్సరానికి రూ.40 వేల కోట్ల చొప్పున 9 సంవత్సరాల పాటు కేసీఆర్  అప్పు చేస్తే తప్పట. కానీ రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలోనే రూ. 1,50,000 కోట్లు అప్పు చేస్తే తప్పు కాదట. ఇదెక్క‌డి న్యాయ‌మ‌మ‌ని ప్ర‌శ్నించారు.  కానీ కెసిఆర్  అప్పుచేసి ప్రజలకు పంచాడు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని గుర్తుచేశారు. రూ.73 వేల కోట్లు  రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసల్ని వేశాడు. రైతుల ఖాతాల్లో టకి టకీ మని డబ్బులు పడట్లేదు గాని ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలో కాంగ్రెస్ అగ్రనేతల ఖాతాల్లోఠంచన్ గా పైసలు పడుతున్నాయ‌ని ఎద్దేవా చేశారు.  ఇక్కడ దోచుకున్న పైసలు అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు పంచుతున్నాడు.

లేకుంటే తనకు పదవి ఉండదన్న సంగతి ఆయనకు తెలుసని ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తూనే ఆయన హయాంలో జరిగిన నియామకాలకు ఈయన పత్రాలు ఇస్తున్నాడ‌ని ఆరోపించారు.  కె.సి.ఆర్‌. 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు.మిషన్ భగీరథ తో మంచినీళ్లు ఇచ్చిండు.కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిండన్నారు. దసరా పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు.ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్టియన్ లకు క్రిస్మస్ కానుకలు ఇచ్చిండు.కులం మతం పంచాయతీ పెట్టుకుంటా ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ప్రజల చిరకాల కోరికలైన నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘ‌న‌త కె.సి.ఆర్‌.దే న‌న్నారు. నిర్మల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజ్ వస్తాయని ఎవరు అనుకోలేదు. కానీ కేసీఆర్ చేసి చూపించారు. తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజ్ లు  మాత్రమే ఉండే కానీ కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా 33 మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదని గుర్తుచేశారు. అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి అధిష్టానం ఎవరికీ టికెట్ ఇస్తే వారికి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాల‌ని పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారం అప్పచెప్పిన ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండమని అంటే ఆ పాత్రను కూడా బీఆర్ఎస్ అద్భుతంగా పోషిస్తున్న‌ద‌న్నారు. జూన్, జూలైలో పార్టీ స‌భ్య‌త్వ కార్యక్రమం చేప‌డ‌తామ‌న్నారు. నిర్మల్ జిల్లాలో మెంబర్షిప్ డ్రైవ్‌ విజయవంతం చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *