– పులుసుబంత ప్రాజెక్టు ప్రారంభిస్తాం
– రైతులకు అందుబాటులో సహకార బ్యాంకులు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వివిధ రూపాలలో రూ.లక్ష కోట్లు సబ్సిడీ రూపంలో అందజేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహకార బ్యాంకు నూతన భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితిస్ వి పాటిల్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రుణమాఫీ, రైతుబంధు, రైతు భరోసా, రైతు బీమా ఇలా అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసిందన్నారు మణుగూరు సహకార బ్యాంకు రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అందరికీ అందుబాటులో ఉండేది సహకార బ్యాంకులేనని, ఇవి అనేక రూపాలలో రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తాయని తెలిపారు. మారేడుబాక ఎత్తిపోతల పథకం పూర్తి కావస్తున్నదని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అటవీ శాఖ అనుమతులు రావడంతో పులుసుబంత ప్రాజెక్టును వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య దొర, బ్యాంక్ సీఈవో ఎన్.వెంకట ఆదిత్య, బ్యాంక్ ఎ.జి ఎం.ఎస్.నవీన్ కుమార్ డి.చందర్రావు, బ్యాంక్ మేనేజర్ వి.బాలరాజు, అశ్వాపురం బ్యాంక్ మేనేజర్ వెంకట కృష్ణారావు, బయ్యారం బ్యాంకు మేనేజర్ సీతారాములు, దొబ్బల వెంకటప్పయ్య, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు నవీన్ కుమార్, చందర్రావు, సొసైటీ సెక్రటరీ జ్ఞాన దాస్ తదితరులు పాల్గొన్నారు.



