– పంట రుణం కట్టేందుకు వెళ్లిన రైతు
– సర్పంచ్ ఎన్నికల్లో పంచినవిగా అనుమానం
– పోలీసులకు ఫిర్యాదు .. దర్యాప్తు ప్రారంభం
నిజామాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగ నోట్ల కలకలం రేగింది. స్థానిక కెనరా బ్యాంక్‌లో పంట రుణం చెల్లించేందుకు రైతు తీసుకువచ్చిన నగదును దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు. రైతు తీసుకు వెళ్లిన రూ.2,08,500 నగదు మొత్తం బ్యాంక్ అధికారులు నకిలీవిగా తేల్చారు. అవన్నీ రూ.500 నోట్లు. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన నరెడ్ల చిన్న సాయిలు గతంలో కెనరా బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఈ నగదు చెల్లించేందుకు గురువారం మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్లాడు. కౌంటర్‌లో ఆ నగదును చెల్లించాడు. అనంతరం ఈ నగదును బ్యాంకు సిబ్బంది లెక్కిస్తుండగా అవి నకిలీ నోట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ నగదు ఎక్కడి నుంచి తీసుకు వచ్చావంటూ రైతు చిన్న సాయిలును బ్యాంకు అధికారులు, సిబ్బంది నిలదీశారు. దాంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పంచిన డబ్బుగా చర్చిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల చలామణి అయినట్లు అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 417 రూ.500 నోట్లు నకిలీగా పోలీసులు తేల్చారు. కాగా, ఇవే నోట్లను ఓ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో వోటర్లకు పంపిణీ చేసినట్లు తేలడంతో గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. వోటు వేసేందుకు నోటు తీసుకున్న వారిలో గుబులు మొదలైంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





