‘పురస పోరుకు క‌స‌ర‌త్తు

– ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఎన్నిక‌లు
– స‌ర్వేల్లో మునిగిపోయిన పార్టీలు
– బ‌ల‌మైన నాయ‌కుల‌ కోసం వేట‌
– రెబెల్స్ ఇబ్బంది లేకుండా వ్యూహాలు
– రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు

ప్ర‌జాతంత్ర‌, న్యూస్ నెట్‌వ‌ర్క్, హైద‌రాబాద్‌, హైద‌రాబాద్ జ‌న‌వ‌రి 17ః రాష్ట్ర రాజకీయ యవనికపై మరో కీలక ఘట్టానికి తెర లేచింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల కోలాహలం ముగిసిందో లేదో, అప్పుడే పట్టణ ప్రాంతాల్లో ‘పుర’ పోరుకు నగారా మోగింది. ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. తాజాగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నిక మాత్రమే కాదు; అధికార కాంగ్రెస్‌కు ఇదొక ‘ప్రజాభిప్రాయ సేకరణ’ అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్,  బీజేపీలకు ఇది తమ ఉనికిని చాటుకునే పోరాటం. గత కొంతకాలంగా రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు ప్రజా ప్రతినిధులు లేక, ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గిపోతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నియమించిన పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం పట్టణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, రేవంత్ ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి, కేంద్రం నుంచి అందాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాబట్టి పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని భావిస్తోంది. ఇప్పటికే 52.42 లక్షల మంది ఓటర్లతో కూడిన తుది జాబితా సిద్ధమైంది. గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రభుత్వం ప్రకటించిన తాజా రిజర్వేషన్ల ప్రకారం పట్టణ స్థానిక సంస్థల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 స్థానాలు (31.4%), ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 స్థానాలు కేటాయించారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు (జనరల్), 30 జనరల్ విభాగాలకు కేటాయించారు. అలాగే 10 ప్రధాన కార్పొరేషన్లలో మేయర్ పదవుల విషయంలో.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీలకు 3 స్థానాలు దక్కాయి. విశేషమేమిటంటే, రిజర్వేషన్లలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ 4 మేయర్ స్థానాలను వారికి కేటాయించారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఈ రిజర్వేషన్ల ప్రకటనతో ఆశావహుల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తమకు అనుకూలమైన వార్డులు రిజర్వ్ అవ్వని నేతలు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను లేదా అనుచరులను రంగంలోకి దించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అభ్యర్థి గెలుపు సామ‌ర్థ్యాన్ని చూస్తున్నాయి

మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడూ ఆర్థికంగా, సామాజికంగా భారీ ఎత్తుగడలతో కూడుకున్నవి. అందుకే ఈసారి పార్టీలు కేవలం గత విధేయతకే పరిమితం కాకుండా, అభ్యర్థి గెలుపు సామ‌ర్థ్యాన్ని ప్రధానంగా చూస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీలతో క్షేత్రస్థాయి సర్వేలు చేయిస్తోంది. ఏ వార్డులో ఏ సామాజిక వర్గం బలంగా ఉంది, ఏ నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఉందో తెలుసుకోవడమే ఈ సర్వేల ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ప్రతి వార్డులోనూ తనకున్న పాత క్యాడర్ ని బలోపేతం చేసుకుంటూ, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఉన్న అసహనాన్ని అధిగమించాలని చూస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలు ప్రధాన భూమిక పోషించనున్నాయి. ముఖ్యమంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో టికెట్ల కోసం ఆశావహుల సందడి మొదలైంది. అయితే గెలిచే వారికే టికెట్లు అని ప్రభుత్వం కరాఖండిగా చెబుతుండటంతో, చాలా మంది సీనియర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ వల్ల నష్టం వాటిల్లిన ఉదాహరణలు ఉన్నాయి. ఈసారి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అసమ్మతి నాయకులను బుజ్జగించడం, ఒకవేళ వారు తిరుగుబాటు చేస్తే వారిపై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. అయినప్పటికీ తమకు అన్యాయం జరిగిందని భావించే నేతలు స్వతంత్రులుగా బరిలోకి దిగితే ఓట్ల చీలిక ఎవరికి లాభం చేకూరుస్తుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చ.

చర్చనీయాంశం కానున్న ఆరు గ్యారంటీల అమలు తీరు 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు పట్టణ ప్రాంతాల్లో అమలు తీరు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశం కానున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సరఫరా, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులు ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తాయి. ఇటు బీఆర్ఎస్ కూడా గత తొమ్మిదిన్నరేళ్లలో తాము చేసిన పట్టణ అభివృద్ధిని, ఫ్లై ఓవర్లు, ఐటీ కారిడార్ల విస్తరణను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పట్టణ ఓటరు నాడి ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉండటంతో (మహిళలు: 26.80 లక్షలు, పురుషులు: 25.62 లక్షలు), పథకాల లబ్ధి పొందిన మహిళా ఓటర్లే గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఎటు తిరిగి ఎటు వెళ్తాయో అర్థం కాని ఒక అనిశ్చితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. పార్టీల సర్వేలు ఒక నాయకుడికి అనుకూలంగా ఫలితాలు చూపిస్తుంటే క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం మా సమస్యలు ఎవరు తీరిస్తే వారికే ఓటు అని స్పష్టం చేస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న అధిష్ఠానాలకు, టికెట్ ఆశిస్తున్న రెబల్స్ భయం నిద్ర లేకుండా చేస్తోంది. మంత్రులు తమ అనుచరులను గెలిపించుకోవాలని పావులు కదుపుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం సర్వేల ఆధారంగానే బి-ఫారమ్ లు ఇస్తానని సంకేతాలిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలు, గత ఎన్నికల ఓటమి ప్రభావం ఎక్కడ పడుతుందో అన్న భయం వేధిస్తోంది. సామాన్య ఓటరు కూడా ప్రస్తుతానికి “వేచి చూసే” ధోరణిలోనే ఉన్నాడు. ఫలితాలు ఎలా ఉన్నా, ఈ ‘పుర’ పీఠాల పోరు మాత్రం సరికొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *