హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో సీఎం కప్ 2024 రెండో అంచె మండల స్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7, 8వ తేదీల్లో గ్రామ స్థాయిలో పోటీలు ముగిసిపోగా, అందులోని విజేతలు మండల స్థాయి పోటీల్లో తలపడుతున్నారు. ఆరు క్రీడాంశాలు అథ్లెటిక్స్, వాలీబాల్ ఫుట్ బాల్, యోగ, ఖోఖో, కబడ్డీ గ్రామస్థాయి పోటీల విజేతలతో పాటు వివిధ మండలాల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న క్రీడాంశాల్లో ఈ పోటీలు కొనసాగుతున్నాయి.
వివిధ మండలాల్లో కొనసాగుతున్నఈ క్రీడా పోటీల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. కాగా ములుగు జిల్లా ములుగు మండలంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అదే విధంగా పలు నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని క్రీడలకు పోటీలను ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ తోపాటు పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు పోటీలను పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 10, 11, 12వ తేదీల్లో మూడు రోజులపాటు మండల స్థాయి పోటీలు పూర్తయిన తర్వాత విజేతలు తదుపరి డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారు. తెలంగాణ స్పోర్టస్ అథారిటీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎల్ బి స్టేడియంలో మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు మండలాల్లో జరిగే కార్యక్రమాలను, క్రీడాకారుల వివరాలను క్రీడా పోటీల ఫలితాలను ఆన్ లైన్ నమోదు చేస్తున్నారు.