మావోయిస్టుల నిర్మూల‌న స‌మంజ‌సం కాదు

నంబాల కేశ‌వ‌రావు స‌హా 27 మంది సామూహిక హ‌త్య‌లు దారుణం
– ఆదివాసి గ్రామాల్లో అల్ల‌క‌ల్లోలం
– ఎన్‌కౌంట‌ర్ల‌పై సుప్రీంకోర్టు స్వ‌తంత్ర క‌మిష‌న్‌తో  విచార‌ణ జ‌ర‌పాలి
– మీడియాపై కొన‌సాగుతున్న ఆంక్ష‌లు
– మావోయిస్టుల‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌పాలి
– కార్పొరేట్లు అడ‌వుల‌ను కొల్ల‌గొడ‌తారు
– ఆప‌రేష‌న్ క‌గార్‌ను బేష‌ర‌తుగా నిలిపేయాలి
– ప్ర‌జాసంఘాల నాయ‌కుల డిమాండ్‌

మధ్య భారతం లోని ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో సహజ వనరులను కొల్లగొట్టడానికి అడ్డుపడుతున్న ఆదివాసులను వారికి అండగా నిలుస్తున్న మావోయిస్టులను నిర్మూలించడానికి బహిరంగ ముహూర్తాలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ-అమిత్ షాలు కామ్రేడ్ నంభాల కేశవరావు హత్యపై హ‌ర్ష‌ధ్వానాలు వ్యక్తం చేయడం శోచనీయ‌మ‌ని ప్ర‌జాసంఘాల నాయ‌కులు శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  మన రాజ్యాంగం 5,6 వ షెడ్యూల్ల ద్వారా ఆదివాసి ప్రాంతాలకు, నివాసాలకు,జన సమూహాలకు పలు రక్షణలు కల్పించింది. పలు చట్టాలతో పాటు,ప్రత్యేక అధికారాలనిచ్చింది.2024 జనవరిలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఆపరేషన్ కగార్ కింద‌ లక్షలాది ఎకరాల్లో సాయుధ బలగాల శిబిరాలు ఏర్పడి అడవులలో స్వతంత్ర జీవనం సాగించే ఆదివాసులను బలవంతంగా క్యాంపులకు తరలిస్తున్నారు. మాట విన‌ని గ్రామాలపై దాడులు, బెదిరింపులు,చివరకు బాంబుల దాడులు చేస్తూ జన జీవితాన్ని అల్లకల్లోలం సృష్టిస్తున్నార‌న్న  వార్తలొస్తున్నాయి. వందలాది మంది ఆదివాసులు, మావోయిస్టులు మరణిస్తున్నారు. ఈ విధ్వంసకాండ ప్రపంచానికి తెలియకుండా మీడియా పైన అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దీనికి పరాకాష్టగానే సి.పి.ఐ(మావోయిస్టు) ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు ఆయనతో పాటు మరో 27 మందిని ఎన్ కౌంటర్ పేర పట్టుకొని మట్టు పెట్టారని అనేక వార్తలు వెలువడుతున్నాయి.

అందుకే ఆపరేషన్ కగార్ ప్రారంభించిన 2024 జనవరి నుండి అన్ని సంఘటనలపై, హత్యలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతున్నామ‌ని వారు తమ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే 2025 జనవరిలో ఛత్తీస్ ఘడ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన విజయ సాహు నక్సలైట్లతో శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ మావోయిస్టులు స్పందించినా ప్రభుత్వాలు హింసా ద్వంసాలకే ప్రాధాన్యత నిస్తున్నాయి. నాగా-మిజో లాంటి సాయుధ మిలిటెంట్లతో చర్చలు జరిపిన కేంద్రం మావోయిస్టులతో చర్చలకు స్పందించకపోవడం, మావోయిస్టులను నిర్మూలిస్తామని సాక్షాత్తు దేశ హోం మంత్రి నిండు పార్లమెంటులో ప్రకటించడం రాజ్యాంగ పాలన అవుతుందా? అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేయాల్సి ఉంద‌న్నారు.

చిన్న చిన్న విషయాలను సుమోటోగా స్వీకరించే సుప్రీంకోర్టు దేశంలోనే ప్రధాన పార్టీలు,ప్రజా సంఘాలు,హక్కుల సంఘాలు,ప్రజాస్వామిక వాదులు,మేధావులు ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని కోరుతున్నా మౌనం పాటించడం బాధాకరమ‌న్నారు. పైగా శాంతి చర్చలు కోరుతున్న వారిని వెంటాడి,వేటాడి చంపడాన్ని ఖండించాల్సిందే. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 2004 అక్టోబర్ లో జరిగిన శాంతి చర్చల తర్వాత విప్లవ పక్షాలు తీవ్రంగా నష్టపోయిన విషయం జగమెరిగిన సత్యం.అయినా ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం లేదంటే మావోయిస్టుల పేరుమీద అటవీ చట్టాలన్నింటినీ అతిక్రమించే ఉద్దేశాలున్నాయని ఎవరైనా సులభంగా గ్రహించవచ్చున‌నిపేర్కొన్నారు. సాయుధ బలగాల పహారాలో కార్పొరేట్లు ఖనిజ సంపదను యదేచ్చగా కొల్లగొడతారని మనం ఊహించవచ్చ‌న్నారు.

అసమాన ఆర్థిక-సామాజిక వ్యవస్థలో అసంతృప్తులు,  నిరసనలు,ప్రతిఘటనలు సహజ సిద్ధంగా ఉత్పన్నమవుతాయి.  హింస-ప్రతి హింస-రాజ్య హింసల పరంపరలో రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నప్పుడు సుప్రీంకోర్టు స్పందించకుంటే, దేశ ప్రజల ముందున్న ప్ర‌త్యామ్నాయ‌మేంటి? ప్రజలెప్పుడు మౌన ప్రేక్షకులుకాజాల‌ర‌ని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ ను బేషరతుగా నిలిపివేసి మావోయిస్టులతో చర్చలకు సిద్ధపడాలని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామ‌న్నారు. నంబాల కేశవరావు సహా 27 మంది హత్యలను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధ్యులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, వీడియో రికార్డింగ్ ద్వారా బంధుమిత్రుల సమక్షంలో పోస్టుమార్టం జరపాలి. మృత‌దేహాల‌ను  కుటుంబ సభ్యులకు అందజేయాలి. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుండి నంబాల కేశవరావు ఎన్  కౌంటర్  వరకు జరిగిన సంఘటనలన్నింటిపై సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిషన్ ద్వారా విచారణ జరిపించాలి. మధ్యభారతంలో అమలవుతున్న రాజ్యం చుట్టివేత-అణచివేత, చర్యలన్నింటిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి శాంతి చర్చల కమిటీ సభ్యుల మధ్యవర్తిత్వంలో కేంద్రం వెంటనే మావోయిస్టులు, ఆదివాసి జేఏసీ లతో శాంతి చర్చలకు ముందుకు రావాలి. గడచిన 16 సంవత్సరాలుగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అడవి-బొగ్గు-ఇతర ఖనిజ సంపదలపై జరిగిన వ్యాపార ఒప్పందాలన్నింటిని ప్రభుత్వం బహిరంగ ప‌ర‌చాల‌ని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై సంత‌కాలు చేసిన‌వారిలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు  విమలక్క, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు  పట్లోళ్ల నాగిరెడ్డి , వెల్తురు సదానందం, ఎఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం,  అంజయ్య, పీడీఎస్‌యూ (విజృంభణ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు   రాయిసిడం బాబురావు-అల్లూరి విజయ్,  అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు  ఏపూరి మల్సూర్, రమేష్ పోతుల,  రాష్ట్ర పీఓడ‌బ్ల్యు (స్త్రీ-విముక్తి) రాష్ట్ర కన్వీనర్ అరుణ వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *