వైఎస్‌ఆర్ పేరుమీద ఫౌండేషన్, అవార్డులు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అందులో భాగంగా వైఎస్‌ఆర్ పేరు మీద ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. వచ్చే వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన వారిని, వ్యవసాయంపై పరిశోధన చేస్తున్న వారిని, ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ రంగానికి దోహదపడుతున్న వారిని గుర్తించి వైఎస్‌ఆర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ను నిత్యం స్మరిస్తూ వారి ఆలోచనను ముందుకు తీసుకువెళతామన్నారు. రాజశేఖర రెడ్డి అంటే మొదట గుర్తుకొచ్చేది వ్యవసాయం.. ప్రాజెక్టులేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రెండు జీవనదులపై ప్రాజెక్టులు కట్టి నీటిని పంట పొలాలకు పారించిన ఆలోచన ఆయనదేనని చెప్పారు. వైఎస్‌ఆర్ భౌతికంగా లేనిలోటును ఎవ్వరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తీర్చలేరని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు.




