‌రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం

అన్నదాతలను కాపాడుకోవడమే మా లక్ష్యం
•వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5: అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం దారూర్‌ ‌మండల రైతు వేదికలో ‘‘ రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’’ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌రైతు కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కోదండ రెడ్డి పాల్గొ న్నారు.  ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ అన్నారు.  రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి అన్నారు. రైతులు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు పండించాలని, యూరియా పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. రైతులు ఉద్యానవన పంటలు వేయాలని సూచించారు.  ఆయిల్‌ ‌పామ్‌ ‌పంటలు వేస్తే అధిక ఆదాయం వస్తుందన్నారు. పొలాల్లో ఒకే పంట కాకుండా అంతర్‌ ‌పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.

రైతులు పాడి పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వంట నష్టపోయిన రైతులకు పంట బీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.  ఇప్పటికీ రైతు బీమా  రైతు  భరోసా కింద 33 వేల కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు. రైతులే నిజమైన శాస్త్రవేత్తలని మంత్రి అన్నారు. శాస్త్రవేత్తలు తయారుచేసిన విత్తనాలను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా వర్షాధార పంటలే ఉన్నాయని రైతు రైతులకు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని చెప్పారు. రైతుల కష్టాలను తీర్చే దిశగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌వ్యవసాయ శాఖ కమిషనర్‌ ‌గోపి, జయశంకర్‌ ‌వ్యవసాయ యూనివర్సిటీ వీసీ జానయ్య, అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌విజయ్‌ ‌కుమార్‌ ‌వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌ ‌రెడ్డి,  రైతు సంక్షేమ కమిటీ సభ్యులు సునీల్‌ ‌జనార్దన్‌ ‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *