- పిల్లల మర్రి సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు
- తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలన్న మంత్రి జూపల్లి
పాలమూరు, ప్రజాతత్ర, మే 16 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు.16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయం సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన శాల ను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలు, తెలుసుకున్నారు.
మ్యూజియం వద్ద రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోటోలు దిగారు. అనంతరం పిల్లలమర్రి మహా వృక్షం సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఎన్నో మానులు కానీ మొదటి మాను ఎక్కడో ఇప్పటికీ తెలుసుకోలేక పోయిన 700 సంవత్సరాల వయస్సు కలిగిన మహా మర్రి వృక్ష ప్రకృతి అందాలను చూసి సుందరీమణులు తన్మయంతో మైమరచిపోయారు. అడుగడుగున తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు బోనాలు, లంబాడ నృత్యం, రంగు రంగుల రంగవల్లి, భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన సుందరీమణులు తన్మయంతో పులకించిపోయారు. తెలంగాణ బతుకమ్మ పాటలకు అందాల బొమ్మలు ఆడి పాడి ఆనందించారు. పిల్లల మర్రి చెట్టు చరిత్రను జిల్లా అటవీ శాఖ అధికారి సుందరీమణులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి విచ్చేసిన పోటీదారులకు స్వాగతం పలికారు. శతాబ్దాలుగా, లెక్కలేనన్ని మంది సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు ఈ వృక్షశాస్త్ర అద్భుతాన్ని సందర్శించారు. మీరందరూ మీ మీ దేశాలను గెలుపొందాలనే ఆశలు, కలలను నిజం చేస్తూ, మీ సంబంధిత దేశాలను గర్వపడేలా చేసే ఆదర్శనీయమైన లక్ష్యంతో తెలంగాణలో ఉన్నారు. మీ రాక మమ్మల్ని చాలా సంతోషపరిచింది. ఈ పట్టణ-ప్రాంతానికి ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విచ్చేసిన సుందరీమణులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రేమగల ప్రజలు ఉన్న భూమి అని, తెలంగాణ సాంస్కృతిక విలువలు, జ్ఞానోదయం, వినోదం కలిసి సాగుతాయనీ అన్నారు.

ఈ ప్రకృతి ఒడిలో తిరిగినప్పుడు, మీ చుట్టూ ఉన్న విషయాల గురించి మీరు కొత్త ఆలోచనలను కనుగొన్నారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇది ఖచ్చితంగా ఆత్మను నింపే అనుభవం, మీ ఆలోచనాత్మక మనస్సులకు మరియు స్పందించే యువ హృదయాలకు ఒక విందు అని చెప్పారు. పిల్లల మర్రి ని తెలంగాణ ప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక సముదాయంగా అభివృద్ధి చేసిందనీ ఎందుకంటే చెట్టు, ఆలయం ఆకట్టుకునే కలయికగా ఉన్నాయన్నారు. ఈ పవిత్రమైన మర్రి చెట్టు యొక్క వైభవం దాని అనేక ఊడలు, కొమ్మలు మరియు పచ్చదనంతో నిండిన విశాలమైన విస్తీర్ణంలో ఉంది. ఇది భారతదేశంలోనే పురాతనమైన జీవన మర్రి చెట్టనీ అన్నారు. పోటీదారులు తమ ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరారు. పర్యాటకం అనేది కేవలం పర్యాటకులకు మాత్రమే కాదని ఎంతో మందికి స్వయం ఉపాధి, ప్రాంత సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల మర్రి అనేది కేవలం పాలమూరు జిల్లాకు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం, భారత దేశానికి గర్వకారణమని అన్నారు.
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆసియా ఖండం సుందరీమణులు పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రి విశిష్టతలను వీక్షించేందుకు విచ్చేసినందుకు గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రపంచ సుందరీమణులు ఎన్నో తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళతారని పేర్కొన్నారు. పిల్లల మర్రి మహావృక్షం 700 సంవత్సరాల క్రితం జన్మించిందని, మరో 700 సంవత్సరాలు జీవించి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి, గద్వాల శాసన సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి, నారాయణపేట శాసన సభ్యులు పర్ణిక రెడ్డి, కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ డి. జానకి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.





