తెలంగాణలో జోరుగా ఉపాధి హామీ పనులు

మొదటి రెండు నెలల్లోనే 70 శాతం పూర్తి
పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని, కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పని దినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పని దినాలను పూర్తి చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం కేటాయించిన పని దినాల్లో 70 శాతం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకుందన్నారు. గతంలో మాదిరి 12 కోట్ల పని దినాలు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించినట్లు, ఒక్కో కుటుంబం సగటున 24 రోజుల పని దినాలను పూర్తి చేసుకుందని, 1127 కుటుంబాలు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయని, సగటున ఒక్కో కూలీకి రూ.250.75 రోజువారీ వేతనం లభిస్తుందని, అయితే రోజువారీ వేతనం రూ.307 దక్కెేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. ఉపాధి హామీ పనుల్లో 60 శాతం పనులు వ్యవసాయ అనుబంధ పనులు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా వ్యవసాయ అనుబంధ పనులు 50 శాతంగా నమోదయ్యాయన్నారు. ఇందులో ప్రధానంగా ఫాం పాండ్స్‌, పశువుల కొట్టాలు, మొక్కలు నాటడం వంటి పనులు లక్షకు పైగా కొనసాగుతున్నాయని, జీపీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల వంటి వమౌలిక వసతుల కల్పన పనులు లక్షా 31 వేలకు పైగా కొనసాగుతున్నాయని వివరించారు. అయితే ఉపాధి హమీ పనుల్లో ఉపాధి కల్పనతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన, ఆస్తుల సృష్టికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రధాన్యతనిస్తోందని మంత్రి సీతక్క ఆ ప్రకటనలో తెలిపారు. మే నెల ముగిసేనాటికి ఉపాధి హామీలో భాగంగా రూ.1416 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని, అందులో రూ.1151.67 కోట్లు వేతనాలు కాగా, రూ.191.03 కోట్లు మెటీిరియల్‌ కాంపోనెంట్‌గా నమోదైందన్నారు. అయితే కేంద్రం నుంచి నిధుల విడుదలతో జాప్యం అయినా కూలీలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వేతనాలను ఉపాధి కూలీల ఖాతాల్లో జమచేస్తోందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుండటంతో ఉపాధి పనులకు ప్రజలు అధిక సంఖ్యలో మొగ్గు చూపుతున్నారన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉపాధి పని దినాలను కేంద్రం సగానికి కుదించిందన్నారు. దీనిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్రానికి మంత్రి సీతక్క ఇప్పటికే లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *