విజన్‌-2047లో విద్యుత్‌ శాఖ పాత్ర కీలకం

– డిమాండ్‌కనుగుణంగా ఇన్‌ఫ్రా పెంచుకోవాలి
– సోలార్‌ విద్యుదుత్పత్తి పెంచేందుకు చర్యలు
– ఇందిరా సౌర గిరిజన వికాసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి
– విద్యుత్‌ శాఖ ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై భట్టి సమీక్ష

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 అమలులో విద్యుత్‌ శాఖ కీలక పాత్ర పోషించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల విద్యుత్‌ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ విద్యుత్‌ నియోగదారులకు మెరుగైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందిన ప్రతి సలహా నోట్‌ చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాల దృష్ట్యా రెండు 400 కేవి సబ్‌ స్టేషన్‌లను మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా పరిధిలో 5 యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు, కొత్త పారిశ్రామిక పార్కులను మంజూరు చేశామని, వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ పంపిణీ, రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదలు, వర్షాల సమయంలో నీటిలోకి వెళ్లి విద్యుత్‌ సిబ్బంది పనిచేసి రికార్డు సమయంలో విద్యుత్‌ పునరుద్ధరిస్తుండడాన్ని కొనియాడుతూ ఆ సిబ్బంది కృషి ఫలితాన్ని కొద్దిమంది తమ స్వార్థం కోసం చెడగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గతంలో ఏళ్లతరబడి పెండిరగ్‌ ఉన్న పదోన్నతులు, బదిలీలు ప్రజా ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగాయని, డైరెక్టర్ల నియామకం కూడా చేశామని మంత్రి భట్టి చెప్పారు. లైన్‌మన్‌ నుంచి సీఎండీ వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తే విద్యుత్‌ శాఖ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. ఎస్పీడీసీఎల్‌ సిబ్బందికి యూనిఫామ్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక విద్యుత్‌ అంబులెన్స్‌ అందుబాటులో ఉండాలని సూచించారు. 1912 నెంబర్‌ను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఆ నెంబరుకు తానే స్వయంగా ఫోన్‌ చేసి పరీక్షిస్తానన్నారు. వ్యవసాయ విద్యుత్‌ నూతన కనెక్షన్‌ దరఖాస్తులను త్వరగా మంజూరు చేయాలని చెప్పారు. ఇందిరా సౌర గిరి జల వికాసం కింద సోలార్‌ పంప్‌ సెట్ల ద్వారా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని, పథకం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల మేజర్‌ కాల్వలు, భూముల వద్ద సోలార్‌ విద్యుత్‌ ప్యానల్స్‌, మీడియం ప్రాజెక్టుల వద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దేవాదాయ భూములలో కూడా సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఆదేశించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి సోలార్‌ విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయానికి కూడా ఆసక్తి గల వారికి సోలార్‌ విద్యుత్‌ పంపు సెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.

గృహజ్యోతి లబ్దిదారులకు జీరో బిల్లు అందిస్తూ ప్రభుత్వం నెలకు ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎంత బిల్లు చెల్లిస్తున్నదో తెలియజేయాలన్నారు. ఎస్పీడీసీఎల్‌ సీఎండి కర్నాటి వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వేసవి కోసం ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద రెండు ఉమ్మడి జిల్లాల్లో 10 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.3 వేల కోట్లను డిస్కంలకు ప్రభుత్వం గృహ జ్యోతి కింద విడుదల చేస్తున్నదని, రూ.54 కోట్ల ఖర్చుతో ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, విద్యుత్‌ సిబ్బందికి రూ.కోటి ప్రమాద బీమా కల్పించామని వివరించారు. కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మనం తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేస్తున్నామని, దీనిలో విద్యుత్‌ సంబంధిత ఇన్‌ఫ్రా పెంచడం చాలా కీలకమని అన్నారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, సీఈలు టి.సదర్‌లాల్‌, కె.తిరుమల్‌రావు, రాజు చౌహాన్‌, ఆర్‌.చరందాస్‌, ఉమ్మడి జిల్లా ఎస్‌ఈలు, ఈఈలు, ఏడీఈలు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *