– పంచాయతీరాజ్, ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు
– నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు
– రాజకీయాలకతీతంగా సమగ్రాభివృద్ధికి పనిచేయాలి
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఎన్నికలు అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా, విజయవంతంగా పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, నిబద్ధతతో పనిచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఎన్నికల అథారిటీగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జి.సృజనకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహాయసహకారాలు అందించిన పోలీస్, ఇతర శాఖల అధికారులకు, సిబ్బందికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా, రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు పూర్తి కావడం సమష్టి కృషికి నిదర్శనమన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటివరకు రాజకీయ పోటీలు ఉన్నా నేటి నుంచి గ్రామాల సమగ్రాభివృద్ధికి పార్టీలకతీతంగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను విశ్వాసంతో స్వీకరించి పారదర్శక పాలనతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పల్లెలే తెలంగాణ సౌభాగ్యం.. పల్లెల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి పరిపూర్ణమవుతుందని అన్నారు తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాసేవకు అంకితం కావాలని ఆమె కోరారు. గ్రామాల ప్రగతే లక్ష్యంగా, ప్రజల భాగస్వామ్యంతో బలమైన గ్రామ పంచాయతీలను నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





