– మూడో విడతలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు
– ఉదయం నుంచే క్యూలో నిలబడ్డ ఓటర్లు
– 3,752 సర్పంచ్ పదవులకు, 28,410 వార్డులకు పోలింగ్
– ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు రానుపోను చార్జీలతో పిలుపులు
– పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్న పరిగి ఎమ్మెల్యే
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్17: రాష్ట్రంలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగాయి. బుధవారం జరిగిన మూడో దశ పోలింగ్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రానుపోను కిరాయి డబ్బులు ఇచ్చి రప్పించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కాగా, మొదటి, రెండో విడత ఎన్నికల మాదిరిగానే మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ గట్టి పోటీనిచ్చింది. మూడో విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పోలింగ్ ముగియగా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పోలింగ్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ పార్టీకి చెందినవారు దాడికి పాల్పడ్డారు. తమకు ఓట్లు వేయాలంటూ కాంగ్రెస్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తుండటంతో బీఆర్‌ఎస్ ఏజెంట్లు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో నలుగురు గాయపడ్డారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు గాయపడిన వారిని పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తున్నాడని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్తి సహా పలువురు గాయపడ్డారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకు కూర్చున్నారు. ఆయన తన సొంత గ్రామం దోమ మండలంలోని శివారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో ఓటమిని ఎదురుచూశారు. అలా తనకు కూడా కావొద్దని అనుకున్నారో ఏమో ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. ఓటేయడానికి వెళ్లే వారిని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం వద్ద కూర్చున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముథోల్‌లో సమయం ముగిసినా క్యూలో ఓటర్లు
నిర్మల్: నిర్మల్ జిల్లా ముథోల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు పోలింగ్ సమయం ముగిసినా క్యూలో ఉండడంతో వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. మధ్యాహ్నం ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు సిబ్బంది టోకెన్లు అందజేశారు. పదివేలకు పైగా ఓటర్లు కలిగిన ఈ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. భారీ సంఖ్యలో ఉన్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం 16 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 15 వార్డులకు సరిపడేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఈ 15 వార్డుల్లో 50మంది అభ్యర్థుల వరకు పోటీలో ఉన్నారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసే వారందరికీ ప్రవేశం, నిష్క్రమణ ఒకే మార్గం కావడంతో రద్దీ పెరిగింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఘర్షణ : చెదరగొట్టిన పోలీసులు
ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తొలుత గుర్తింపు కార్డు లేకుండా వెళ్లాడు. ఓటేసేందుకు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగాడు. తర్వాత గుర్తింపు కార్డుతో మరోసారి వచ్చాడు. ఆ వ్యక్తి దొంగ ఓటు వేస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా గంగారావు ఆగ్రహంతో అతడిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా డిరడి మండలం శాంతిగూడెంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయమైంది. అతడిని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సర్పంచ్ అభ్యర్థి వద్ద పోలీసులు నగదు స్వాధీనం చేసుకన్నారు. స్థానిక పోలింగ్ కేంద్రం సవిూపంలో జనం గుమిగూడి ఉండటంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. సర్పంచ్ అభ్యర్థి వద్ద రూ.28,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





