– 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్
– నామినేషన్లు దాఖలుకు 21 చివరి తేదీ
– సెప్టెంబర్ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన
న్యూదిల్లీ, ఆగస్టు 1: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ధన్‌ఖడ్ తన పదవిని వీడారు. ఈ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు ఈనెల 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 21గా పేర్కొంది. సెప్టెంబర్ 9న ఎన్నిక నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిరచనున్నది. ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీ కోసం 394మంది మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు విపక్ష కూటమికి లోక్‌సభలో 234మంది, రాజ్యసభలో 79 మంది సభ్యుల బలముంది. మొత్తంగా ఎన్డీయేకు 422 మంది, విపక్ష కూటమికి 313మంది అనుకూలంగా ఉన్నారు. ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు విపక్షాలు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్డీయే ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా పలువురు నేతల పేర్లు వినవస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు బీజేపీ ఆ పదవిని అప్పగిస్తుందని సమాచారం.





