రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు 

– రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
– మూడు విడతల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్లకు ఎన్నికలు
ప్రజాతంత్ర, మంచిర్యాల, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సిద్ధమైంది.ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ముందుగా రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడుతల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అక్టోబర్‌ 9వ తేదీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా.. అదే రోజు నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. అక్టోబర్‌ 23వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు తొలి విడుత, అదే నెల 27న రెండో విడుతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 17వ తేదీన తొలి విడుత సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేనున్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు.  మంచిర్యాల జిల్లాలో 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ, 306 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 3,394 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.పంచాయతీ ఎన్నికలకు 2,680, పరిషత్‌ ఎన్నికలను 714 కేంద్రాల్లో నిర్వహించనుండగా 3,76,669 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో పల్లెల్లో సందడి
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో, స్థానిక పరిషత్ ఎన్నికల వాతావరణం పల్లెల్లో తీవ్రంగా వేడెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.
అధికార, ప్రతిపక్షంలో పెరుగుతున్న పోటీ
పార్టీ గుర్తుతో జరిగే ఈ పరిషత్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల్లో అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ నుంచి బరిలోకి దిగాలనుకునే ఆశావహుల మధ్య పోటీ అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే స్థాయిలో, ప్రతిపక్షం నుంచి కూడా తమకు తిరుగులేదనే ఉద్దేశంతో అనేక మంది నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజాబలం ఉన్నవారికే టికెట్ కోసం కసరత్తు
ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో, ఆయా పార్టీల అగ్ర నాయకులు కేవలం ‘ప్రజాబలం’ ఉన్న అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గెలుపును నిర్ధారించే సత్తా ఉన్న నాయకులకే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
టికెట్ కోసం ఆశావహుల పరుగు
ఈ నేపథ్యంలో, తాము మాత్రమే విజయం సాధించగలమని నిరూపించుకునేందుకు పలువురు ఆశావహులు పార్టీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ‘తమకే టికెట్ కేటాయించాలి’ అంటూ వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి, పార్టీ అండదండలు, చిహ్నం తమ విజయానికి దోహదపడతాయని నమ్ముతున్న ఆశావహులు, తమకు టికెట్ ఇవ్వాలని కోరుతూ అగ్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, స్థానిక రాజకీయాలు రసకందాయంలో పడి, పల్లెల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
—————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *