యాదగిరిగుట్ట ఆలయ ఈఈని కోర్టుకు హాజరుపరిచిన అధికారులు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావు కార్యాలయంలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మేడిపల్లిలో నల్గొండకు చెందిన ఒక కాంట్రాక్టర్ నుంచి ఈఈ రామారావు రూ.1.90లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తూ మిషనరీ రిపేరింగ్, కరాబైన మిషన్లు రీప్లేస్‌మెంట్ చేస్తూ ఉండే వ్యక్తి యాదగిరిగుట్ట దేవస్థానంలో మూడు నెలల క్రితం టెండర్ ద్వారా దేవస్థాన ప్రసాద తయారీ కేంద్రంలో ఒక యంత్రాన్ని సరఫర్లా చేశారు అందుకు రూ.11 లక్షల 50 వేల బిల్లు కాగా ఆ బిల్లు మంజూరు చేసి కాంట్రాక్టరుకు ఇవ్వడానికి ఈఈ వెంకటరామారావు ఆ బిల్లులో 20 పర్సెంట్ కమీషన్ అడిగారు. అంత డబ్బులు ఇవ్వలేనని కాంట్రాక్టర్ బతిమిలాడి రూ.1.90 లక్షలు ఇస్తానని, బిల్లు పాస్ చేయాలని ఈఈని కోరారు. అనంతరం లంచం ఇవ్వడం ఇష్టం లేక నల్లగొండ ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడని, దీనిపై తాము విచారించగా గతంలో రామారావుపై అనేక ఆరోపణలొచ్చాయని, సస్పెండ్ కూడా అయినట్లు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్‌తో రామారావు లంచం అడుగుతూ మాట్లాడిన ఆడియో, వీడియోలను ఆధారంగా చేసుకుని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. అందులో భాగంగా బుధవారం బోడుప్పల్ ప్రాంతంలో కాంట్రాక్టర్ నుండి రూ.1.90లక్షల నగదు తీసుకుంటుండగా ఏసిబి అధికారులు ఈఈ రామారావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకొని యాదగిరిగుట్ట దేవస్థానంలోని ఈఈ రామారావు చాంబర్‌లో, అదే సమయంలో ఎల్బీనగర్‌లోని రామారావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎల్బీనగర్‌లోని ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. యాదగిరిగుట్ట అధికారులకు విషయం తెలిపి రామారావును గురువారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేసి చెబితే మీ వివరాలు గోప్యంగా ఉంచి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


