విద్యా ప్రదాత యెన్నం శ్రీనివాస్ రెడ్డి

– సమాజాభివృద్ధికి విద్యే మూలాధారం అని రుజువు చేశారు

– మంత్రి పొన్నం ప్రభాకర్

మహబూబ్ నగర్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారం అని మరోసారి రుజువు చేస్తూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యా ప్రదాతగా నిలుస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే యెన్నం తన తండ్రి స్వర్గీయ యెన్నం జానకి రామిరెడ్డి జ్ఞాపకార్థం తన సొంత‌ నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లర్నింగ్ సెంటర్ను పశు సంవర్ధక, మత్స్య, డెయిరీ, యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక, గనుల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి మాత్రమే కాక ఆ విద్య విలువలను సామాజిక బాధ్యతగా మలచిన నాయకుడు అని అన్నారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రైవేట్ విద్యార్థులకు సమానంగా ఆధునిక అవకాశాలు పొందాలనే సంకల్పంతో ఈ డిజిటల్ లర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయం” అని అన్నారు. స్వర్గీయ యెన్నం జానకి రామిరెడ్డి విద్య, విలువలు, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని గుర్తుచేస్తూ, వారి జ్ఞాపకార్ధంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వందలాది బాలికల జీవితాల్లో జ్ఞానవెలుగులు నింపుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి గాను ఎమ్మెల్యే ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఖాళీలను భర్తీ చేసిందని తెలిపారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, డిజిటల్ టెక్నాలజీ, కంప్యూటర్ నైపుణ్యాలు, ఆన్లైన్ లెర్నింగ్ వంటి అంశాల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించాలని సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ లర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యా రంగానికి మరింత తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంది బోయి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జీ గోనెల శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీతో పాట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *