– విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేట్ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్‌ను సోమవారం ఆవిష్కరించి ప్రసంగించారు. సామాజిక మార్పు జరగాలన్నా, వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్నా, సమసమాజ స్థాపనకైనా విద్య ఒక్కటే మార్గం అని తెలిపారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదలు నేటివరకు అనేకమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన విద్యాసంస్థల మూలంగా ఈ దేశం వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఐఐఐటి, ఆర్‌ఈసీ, యుజిసి ఆధ్వర్యంలో పలు యూనివర్సిటీల ఏర్పాటు మూలంగా మన తెలుగు వాళ్ళు ప్రముఖ కంపెనీలకు సీఈఓల స్థాయికి ఎదిగారని వివరించారు. వ్యక్తులు స్థాపించిన విద్యాసంస్థలు యూనివర్సిటీల స్థాయికి ఎదిగి అడ్వాన్సుడ్ టెక్నాలజీని బోధించే స్థాయికి చేరాయని భట్టి పేర్కొన్నారు. సామాజిక అవసరాలకనుగుణంగా సిలబస్ మారితేనే ప్రయోజనమని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ భావించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలకు పనికొచ్చేలా సిలబస్ రూపొందించామని, కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన వంద ఐటిఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని, వివిధ పరిశ్రమల అధిపతులు సూచించిన సిలబస్‌ను వాటిలో ప్రవేశపెట్టామని వివరించారు. పేదలకు ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు 25ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లు పెట్టుబడితో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోఠి ఉమెన్స్ కాలేజీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి రూ.500 కోట్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నామని, ఉస్మానియా యూనివర్సిటీలో కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని, వైస్ చాన్సలర్ల నియామకం చేశామని తెలిపారు. రాబోయే 50, వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నదని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రైవేటు విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.


